Russia: ఉక్రెయిన్ సైనిక స్థావరంపై విరుచుకుపడిన రష్యా... 35 మంది మృతి
- రష్యాకు లొంగని ఉక్రెయిన్
- దాడుల్లో తీవ్రత పెంచిన రష్యా
- ల్వీవ్ వద్ద శాంతిపరిరక్షక దళాల కేంద్రంపై దాడి
- బాంబుల వర్షం కురిపించిన రష్యా యుద్ధ విమానాలు
- నో ఫ్లై జోన్ గా ప్రకటించాలన్న ఉక్రెయిన్ ప్రభుత్వం
వ్లాదిమిర్ పుతిన్ నాయకత్వంలోని రష్యా పగబట్టిన తాచులా ఉక్రెయిన్ పై బుసలు కొడుతోంది. గత రెండు వారాలకు పైగా దాడులు చేస్తున్నప్పటికీ ఉక్రెయిన్ లొంగకపోవడంతో రష్యన్ సేనలు బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. తాజాగా ల్వీవ్ నగరం వద్ద ఓ సైనిక స్థావరంపై వైమానిక దాడులతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో 35 మంది చనిపోయి ఉంటారని, 134 మంది గాయపడ్డారని ఆ ప్రాంత గవర్నర్ మాక్సిమ్ కోజిట్స్కీ వెల్లడించారు.
ఉక్రెయిన్ రక్షణ మంత్రి ఒలెక్సీ రెజ్నికోవ్ కూడా రష్యా వైమానిక దాడులను నిర్ధారించారు. ల్వీవ్ సమీపంలోని అంతర్జాతీయ శాంతి పరిరక్షక దళాల కేంద్రంపై దాడి చేసిందని ఆరోపించారు. ఇక్కడ విదేశీ శిక్షకులు పనిచేస్తుంటారని తెలిపారు. ఎంతమంది చనిపోయారన్నదానిపై ఇప్పుడిప్పుడే స్పష్టత వస్తోందని వివరించారు. ఈయూ-నాటో సరిహద్దు సమీపంలో జరిగిన ఉగ్రదాడి ఇది అని అభివర్ణించారు. రష్యాపై కచ్చితంగా చర్యలు తీసుకోవాలని, గగనతలాన్ని మూసివేయాలని రెజ్నికోవ్ పునరుద్ఘాటించారు.