Team India: బెంగళూరు టెస్టులో భోజన విరామం... 342 పరుగులకు చేరిన టీమిండియా ఆధిక్యం
- బెంగళూరులో డే నైట్ టెస్టు
- టీమిండియా వర్సెస్ శ్రీలంక
- రెండో ఇన్నింగ్స్ లో 5 వికెట్లకు 199 రన్స్ చేసిన భారత్
- పంత్ దూకుడు
బెంగళూరులో శ్రీలంకతో జరుగుతున్న డే నైట్ టెస్టులో టీమిండియా పట్టు బిగించింది. ఆటకు నేడు రెండో రోజు కాగా, శ్రీలంకపై 342 పరుగుల ఆధిక్యం సంపాదించింది. ఇవాళ ఆట ఆరంభంలోనే శ్రీలంకను తొలి ఇన్నింగ్స్ లో 109 పరుగులకే పరిమితం చేసిన రోహిత్ సేన... ఆపై రెండో ఇన్నింగ్స్ ను ఉత్సాహంగా ఆరంభించింది. భోజన విరామం సమయానికి 5 వికెట్లు కోల్పోయి 199 పరుగులు చేసింది.
రిషబ్ పంత్ దూకుడుగా ఆడి 28 బంతుల్లోనే 50 పరుగులు చేశాడు. ఈ క్రమంలో పంత్ భారత్ తరఫున టెస్టుల్లో అత్యంత వేగవంతమైన ఫిఫ్టీ నమోదు చేశాడు. గతంలో ఈ రికార్డు కపిల్ దేవ్ పేరిట ఉండేది. పంత్ స్కోరులో 7 ఫోర్లు, 2 సిక్సులున్నాయి.
కెప్టెన్ రోహిత్ శర్మ 46, హనుమ విహారి 35, మయాంక్ అగర్వాల్ 22 పరుగులు చేశారు. విరాట్ కోహ్లీ 13 పరుగులు చేసి లంక యువ స్పిన్నర్ జయవిక్రమ బౌలింగ్ లో వెనుదిరిగాడు. ప్రస్తుతం క్రీజులో శ్రేయాస్ అయ్యర్ (18 బ్యాటింగ్), రవీంద్ర జడేజా (10 బ్యాటింగ్) ఉన్నారు. లంక బౌలర్లలో జయవిక్రమ 3 వికెట్లు తీశాడు. ఎంబుల్దెనియ 1, ధనంజయ డిసిల్వ 1 వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా 252 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే.