Telangana: ముదురుతున్న ఎండలు.. 40 డిగ్రీలు దాటుతున్న ఉష్ణోగ్రతలు
- మంథనిలో 40.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు
- పెరుగుతున్న రాత్రి ఉష్ణోగ్రతలు
- వచ్చే మూడు రోజుల్లో 40 డిగ్రీలు నమోదయ్యే అవకాశం
తెలంగాణలో ఎండలు రోజురోజుకు ముదురుతున్నాయి. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటేశాయి. పెద్దపల్లి జిల్లా మంథనిలో నిన్న గరిష్ఠంగా 40.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. గతేడాది జూన్ తర్వాత తెలంగాణలో నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత ఇదే కావడం గమనార్హం. అలాగే, మహబూబాబాద్ జిల్లా కురవి మండలంలోని అయ్యగారిపల్లె, జగిత్యాల జిల్లాలోని అలీపూర్‌లలో 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
ఖమ్మం, ములుగు జిల్లాల్లోనూ ఎండలు మండుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల రాత్రి ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతున్నాయి. నిజామాబాద్‌లో సాధారణంగా కంటే 1.6 డిగ్రీలు, భద్రాచలంలో 1.5 డిగ్రీలు అధికంగా నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా పొడి వాతావరణం ఉంటుందని, వచ్చే మూడు రోజుల్లో ఉష్ణోగ్రతలు 37 డిగ్రీల నుంచి 40 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.