Hyderabad: ఈ నెల 24 నుంచి బేగంపేటలో విమాన ప్రదర్శన.. సందర్శనకు టికెట్ ధర ఎక్కువే!
- నాలుగేళ్ల తర్వాత తొలిసారి విమాన ప్రదర్శన
- ఈ నెల 22 నుంచి నాలుగు రోజులపాటు నిర్వహణ
- చివరి రోజు సాధారణ సందర్శకులకు అనుమతి
- ఒక్కొక్కరికి రూ. 500 టికెట్
నాలుగేళ్ల తర్వాత తొలిసారి హైదరాబాద్ బేగంపేటలో విమాన ప్రదర్శనకు రంగం సిద్ధమైంది. ‘వింగ్స్ ఇండియా-2022’ పేరిట ఈ నెల 22న ప్రదర్శన ప్రారంభమై 27 వరకు.. అంటే నాలుగు రోజులపాటు కొనసాగుతుంది. ఇందులో దేశ, విదేశాలకు చెందిన అత్యాధునిక విమానాలు, జెట్ ఫైటర్లు, హెలికాప్టర్లు ప్రదర్శిస్తారు. దాదాపు 200కుపైగా అంతర్జాతీయ సంస్థలు, ఎగ్జిబిటర్లు పాల్గొంటారు. అలాగే, 6 వేల మందికిపైగా వ్యాపారులు, 50 వేల మందికిపైగా సందర్శకులు పాల్గొంటారని అంచనా వేస్తున్నారు.
ఈ భారీ విమాన ప్రదర్శనను చూడాలనుకునేవారు వింగ్స్ ఇండియా వెబ్‌సైట్ ద్వారా రిజిస్టర్ చేసుకోవచ్చు. తొలి మూడు రోజులు వ్యాపారవేత్తలను అనుమతిస్తారు. ప్రదర్శన చివరి రోజైన 27న సాధారణ సందర్శకులను అనుమతిస్తారు. అయితే, టికెట్ ధరను మాత్రం ప్రజలు భయపడేలా నిర్ణయించారు. ఒక్కొక్కరికి రూ. 500గా నిర్ణయించారు. చిన్నారులను ఈ ప్రదర్శనకు తీసుకెళ్లి కాస్తంత విజ్ఞానాన్ని పెంచాలనుకునే తల్లిదండ్రులకు ఈ ధర శరాఘాతంలా ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.