BJP: తెలంగాణపై దృష్టి పెట్టిన బీజేపీ.. త్వరలో రంగంలోకి వ్యూహ బృందం!
- మార్చి చివరికి తెలంగాణలో పని మొదలు
- 60 మందితో కూడిన వ్యూహకర్తల సేవలు
- యూపీలో విజయానికి పనిచేసింది ఈ బృందమే
యూపీలో ఘన విజయం సాధించిన బీజేపీ తదుపరి తెలంగాణపై ప్రత్యేక దృష్టి సారించనుంది. 2023 చివర్లో తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగాల్సి ఉంది. దీంతో పార్టీని గెలుపు దిశగా నడిపించేందుకు బీజేపీ ఇప్పటి నుంచే వ్యూహాలను అమలు చేయనుంది. ఇందుకోసం సొంత ఎన్నికల నిపుణులను రంగంలోకి దింపుతోంది.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నుంచి వరుసగా రెండు పర్యాయాలు టీఆర్ఎస్ అధికారాన్ని అనుభవిస్తోంది. ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించి, మూడో విడత కూడా విజయం సాధించేందుకు ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (పీకే)కు చెందిన ఐప్యాక్ట్ సేవలను టీఆర్ఎస్ తీసుకుంటోంది. ఇప్పటికే ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో పీకే సమావేశమై చర్చలు కూడా జరిపారు.
ఈ నేపథ్యంలో బీజేపీ సొంత వ్యూహకర్తల బృందాన్ని తెలంగాణకు పంపించాలని నిర్ణయించినట్టు పార్టీ వర్గాల సమాచారం. యూపీలో బీజేపీ విజయం కోసం పనిచేసిన బృందాన్ని రంగంలోకి దింపనుంది. మార్చి చివరికి 60 మందితో కూడిన పోల్ స్ట్రాటజీ టీమ్ తెలంగాణలో తన పనిని మొదలు పెడుతుందని పార్టీ వర్గాలు తెలిపాయి. యూపీ తర్వాత బీజేపీ దృష్టి తెలంగాణపై పెట్టిందని వెల్లడించాయి.