Gujarat Titans: ‘గుజరాత్ టైటాన్స్’ జెర్సీ వచ్చేసింది.. అధికారికంగా విడుదల
- భిన్నంగా డిజైన్ చేసిన జెర్సీ
- కెప్టెన్ పాండ్యా, బీసీసీఐ కార్యదర్శి జైషా సమక్షంలో విడుదల
- బౌలింగ్ చేస్తానా? లేదా? అన్నది మీరే చూస్తారు
- సమాధానం దాటవేసిన పాండ్యా
ఐపీఎల్ కొత్త ఫ్రాంచైజీ గుజరాత్ టైటాన్స్.. జట్టుకు సంబంధించిన జెర్సీ (ఆటగాళ్లు ధరించే టీ షర్ట్)ని విడుదల చేసింది. అహ్మదాబాద్ లోని నరేంద్రమోదీ క్రికెట్ స్టేడియంలో జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా, హెడ్ కోచ్ ఆశిష్ నెహ్రా, బీసీసీఐ కార్యదర్శి జైషా సమక్షంలో జెర్సీ విడుదల కార్యక్రమం జరిగింది. మిగిలిన జట్ల జెర్సీలతో పోలిస్తే కాస్త భిన్నంగా ఉంది.
ఈ సందర్భంగా మళ్లీ బౌలింగ్ చేస్తారా? అంటూ పాండ్యాను మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. ‘‘అదొక సర్ ప్రైజ్.. దాన్ని అలాగే ఉండనివ్వండి’’ అంటూ బదులిచ్చాడు. రూ.15 కోట్లతో హార్దిక్ పాండ్యాను జట్టు కెప్టెన్ గా గుజరాత్ టైటాన్స్ తీసుకోవడం తెలిసిందే. ఆల్ రౌండర్ అయిన పాండ్యా గాయాల కారణంగా కొంత కాలంగా బౌలింగ్ కు దూరంగా ఉంటున్నాడు.
మరో కొత్త జట్టు లక్నో సూపర్ జెయింట్స్ తోపాటు గుజరాత్ టైటాన్స్ సహా మొత్తం 10 జట్లు ఈ ఏడాది ఐపీఎల్ సమరంలో తలపడనున్నాయి. ఈ నెల 26 నుంచి ఐపీఎల్ సీజన్ ఆరంభం కానుంది.