Janasena: జనసేన ఆవిర్భావ సభకు భారీగా తరలివచ్చిన జనం.. వీడియోలు ఇవిగో
- గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటంలో సభ
- ఇప్పటికే మంగళగిరికి పవన్ కల్యాణ్
- సభా ప్రాంగణం వద్ద సాంస్కృతిక కార్యక్రమాలు
- బస్సులు, కార్లలో వస్తోన్న అభిమానులు
గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటంలో ఈ రోజు జనసేన పార్టీ ఆవిర్భావ సభ జరుగుతోన్న విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను ఇప్పటికే నేతలు పూర్తిచేశారు. సభలో పాల్గొనేందుకు పెద్ద ఎత్తున జనం తరలివస్తున్నారు. ఇప్పటికే సభా ప్రాంగణం నిండిపోయింది.
ఆ ప్రాంతంలో సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. వాటిని జనసేన అగ్రనేత నాదెండ్ల మనోహర్, ఇతర నేతలు పరిశీలించారు. పార్టీ ఆవిర్భావ సభ నేపథ్యంలో పవన్ కల్యాణ్ కూడా ఇప్పటికే మంగళగిరి చేరుకున్నారు. మరో గంటలో ఆయన ఇప్పటంకు బయలుదేరనున్నారు.
వచ్చే ఎన్నికలకు పార్టీ శ్రేణులను సమాయత్తం చేయడమే లక్ష్యంగా ఈ సభ నిర్వహిస్తున్నారు. జనసేన ఏర్పడి ఎనిమిది ఏళ్లు పూర్తయి తొమ్మిదో ఏట అడుగుపెడుతున్న నేపథ్యంలో భారీ ఎత్తున ఈ సభను ఏర్పాటు చేశారు. 100 అడుగుల వెడల్పు, 40 అడుగుల పొడవు, 15 అడుగుల ఎత్తుతో సభా ప్రాంగణం నిర్మితమైంది.
వచ్చిన జనం అంతా సభా కార్యక్రమాలను చూసేందుకు వీలుగా ప్రాంగణంలో భారీ ఎల్ఈడీ స్క్రీన్‌లను కూడా ఏర్పాటు చేశారు. ఈ వేదికపై నుంచి తమ పార్టీ భవిష్యత్ ప్రణాళికను పవన్ కల్యాణ్ ప్రకటిస్తారని జనసేన నేతలు మీడియాకు తెలిపారు. అలాగే, టీడీపీతో పొత్తుపై కూడా ఈ సభ ద్వారా సూచనలు రానున్నట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయాలపై తమ వైఖరిని పవన్ కల్యాణ్ తెలపనున్నారు. తమ పార్టీపరంగా అనుసరించే విధానాలను వివరించే అవకాశం ఉండడంతో దీనిపై మరింత ఆసక్తి నెలకొంది.
ఇప్పటికే జనసేన పార్టీ విశాఖ సిటీ, ఉత్తరాంధ్ర, రాయలసీమ మినహా అన్ని జిల్లాల్లోనూ కమిటీల ఏర్పాటు ప్రక్రియ పూర్తి చేసుకుంది. దీంతో ఆవిర్భావ సభకు పార్టీ కార్యకర్తలు, అభిమానుల నుంచి ఊహించని స్థాయిలో స్పందన వస్తోంది. కొందరు బస్సులు, కార్లలో నినాదాలు చేస్తూ సభా ప్రాంగణానికి వెళ్తున్నారు.