Crypto Currency: నేల చూపులు చూస్తున్న క్రిప్టో కరెన్సీలు... అంతా రష్యా చలవే!
- ద్రవ్యోల్బణానికి గురైన క్రిప్టో కరెన్సీ
- ఉక్రెయిన్ పై రష్యా దండయాత్ర
- ఊగిసలాడుతున్న వర్చువల్ కరెన్సీలు
ఉక్రెయిన్ పై రష్యా దాడుల ప్రభావం అన్ని రంగాలతో పాటు క్రిప్టో కరెన్సీలపైనా పడింది. ఇటీవల కాలంలో ద్రవ్యోల్బణం ప్రభావానికి గురైన బిట్ కాయిన్, ఎథేరియం తదితర క్రిప్టో కరెన్సీలను గత కొన్నివారాలుగా రష్యా-ఉక్రెయిన్ సంక్షోభం వెంటాడుతోంది. బిట్ కాయిన్ గత 24 గంటల వ్యవధిలో 1.38 శాతం పతనం కాగా, ఎథేరియం 0.37 శాతం నష్టపోయింది. ప్రస్తుతం బిట్ కాయిన్ విలువ 38,612 డాలర్లుగా కొనసాగుతోంది. ఎథేరియం 2,575 డాలర్లుగా చలామణి అవుతోంది.
గత వారం రోజులతో పోల్చితే ఈ రెండు క్రిప్టోలు కాస్తంత కోలుకున్నా, ఓవరాల్ గా ఇంకా కుంగుబాటలోనే ఉన్నట్టు భావించాలి. ఇవే కాదు, డోజీ కాయిన్, సొలానా, పోల్కాడాట్ వంటి ఇతర క్రిప్టో కరెన్సీలదీ ఇదే పరిస్థితి. ఈ పతనం మరికొన్నాళ్లు తప్పదని వర్చువల్ కరెన్సీ మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.