YSRCP: రాజ్యసభలో నేడు రెండు కీలక అంశాలపై ప్రశ్నించిన విజయసాయిరెడ్డి
- రష్యా, ఉక్రెయిన్‌ల యుద్ధం నేపథ్యంలో ప్రశ్నలు
- ఉక్రెయిన్ నుంచి తిరిగొచ్చిన మెడికోల అంశం ప్రస్తావన
- వారికి దేశంలోని వైద్య కళాశాలల్లోనే సీట్లిప్పించాలని వినతి
- ఇంధన ధరలపై కేంద్రం మార్గదర్శకాలేమిటని మరో ప్రశ్న
వైసీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ఈ రోజు రాజ్యసభ ప్రశ్నోత్తరాల సమయంలో రెండు కీలక అంశాలను లేవనెత్తారు. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్‌లో వైద్య విద్య కోసం వెళ్లిన దాదాపు 20 వేల మంది విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో పడిపోయిందని సాయిరెడ్డి సభలో ప్రస్తావించారు. ఆ విద్యార్థులకు ఎలాంటి నష్టం కలగకుండా వారందరికీ దేశంలోని మెడికల్ కాలేజీల్లో సీట్లు కేటాయించేలా చర్యలు చేపట్టాలని ఆయన కేంద్ర ప్రభుత్వానికి సూచించారు.
ఇక సాయిరెడ్ది ప్రస్తావించిన రెండో అంశం విషయానికి వస్తే.. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో దేశంలో ఇంధన ధరలు ఓ రేంజిలో పెరగనున్నాయన్న వార్త కొన్ని రోజులుగా హల్ చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదే అంశాన్ని ప్రస్తావించిన సాయిరెడ్డి.. ఇంధన ధరలపై కేంద్రం విధిస్తున్న సెస్సు, ఇతరత్రా పన్నులకు సంబంధించిన విధి విధానాలేమిటని ప్రశ్నించారు.