Chandrababu: మృతుల కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున పరిహారం అందించాలి: చంద్రబాబు డిమాండ్
- వైసీపీ నేతలే కల్తీ సారాను అమ్ముతున్నారు
- కల్తీ సారాకు ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారు
- మద్యం తయారీ నుంచి అమ్మకాల వరకు అన్నీ జగనే చేస్తున్నారంటూ బాబు ఆరోపణ
అధికారంలోకి వస్తే మద్యనిషేధాన్ని అమల్లోకి తీసుకొస్తామని ఎన్నికల సమయంలో జగన్ చెప్పారని... అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీని గాలికొదిలేశారని చంద్రబాబు మండిపడ్డారు. రాష్ట్రంలో మద్యం, నాటుసారా ఏరులై పారుతోందని చెప్పారు. వైసీపీ నేతలే కల్తీ సారాను అమ్ముతున్నారని విమర్శించారు. పక్క రాష్ట్రాల నుంచి మద్యాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఎక్కువ ధరకు అమ్ముతున్నారని ఆరోపించారు.
జంగారెడ్డిగూడెంలో ఈరోజు చంద్రబాబు పర్యటించారు. కల్తీ మద్యం కారణంగా మృతి చెందిన వారి కుటుంబాలను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ పై విమర్శలు గుప్పించారు. ఏపీలో మద్యం తయారీ నుంచి అమ్మకాల వరకు అన్నీ జగనే చేస్తున్నారని చంద్రబాబు తీవ్ర ఆరోపణలు చేశారు.
కల్తీసారాకు ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కల్తీ మద్యం తాగి మృతి చెందిన వారి కుంటుంబాలకు రూ కోటి చొప్పున పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాలకు టీడీపీ తరపున సాయం చేస్తామని... ఒక్కో కుటుంబానికి లక్ష రూపాయల చొప్పున మొత్తం 26 కుటుంబాలకు సాయాన్ని అందిస్తామని చెప్పారు.