Telangana: తెలంగాణ అసెంబ్లీలో మాటకు మాట... రచ్చ!
- కాంట్రాక్టర్ల అంశంపై కోమటిరెడ్డి ప్రస్తావన
- కోమటిరెడ్డిని కాంట్రాక్టర్‌తో పోల్చిన తలసాని
- పేకాటరాయుళ్లు మంత్రులయ్యారన్న కోమటిరెడ్డి
- ఆపై క్షమాపణ, రికార్డుల నుంచి కామెంట్ల తొలగింపు
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా సోమవారం నాటి సభలో సరికొత్త రచ్చ చోటుచేసుకుంది. అధికార టీఆర్ఎస్, విపక్ష కాంగ్రెస్‌ల మధ్య చోటుచేసుకున్న ఈ రచ్చలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, కాంగ్రెస్ పార్టీకి చెందిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మధ్య మాటల తూటాలు పేలాయి. కోమటిరెడ్డిని కాంట్రాక్టర్ అంటూ తలసాని అభివర్ణిస్తే.. తలసానిని కోమటిరెడ్డి పేకాటరాయుడితో పోల్చారు. ఈ రెండు పదాలు వినబడటంతో సభలో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది.
సభలో చర్చ సందర్భంగా కాంట్రాక్టర్ల సమస్యలను కోమటిరెడ్డి ప్రస్తావించారు. దీంతో స్పందించిన తలసాని..కోమటిరెడ్డి కాంట్రాక్టర్ కాబట్టే కాంట్రాక్టర్ల గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. దీనికి ప్రతిగా స్పందించిన కోమటిరెడ్డి పేకాటాడిన వాళ్లు మంత్రులు కావొచ్చు గానీ.. కాంట్రాక్లర్లు ఎమ్మెల్యేలు కావొద్దా? అని ప్రశ్నించారు.
దీంతో ఒక్కసారిగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కోమటిరెడ్డి క్షమాపణ చెప్పాల్సిందేనంటూ పట్టుబట్టారు. అయితే తన నోట నుంచి వచ్చిన మాట ఎంతటితో అర్థం చేసుకున్న కోమటిరెడ్డి ఎలాంటి భేషజం లేకుండానే వెంటనే క్షమాపణ చెప్పారు. ఆ తర్వాత ఆయన వ్యాఖ్యలను స్పీకర్ రికార్డుల నుంచి తొలగించారు. దీంతో సభ సద్దుమణిగింది.