Nagababu: మూడేళ్ల పాటు రాజధాని లేకుండా పాలించిన ఘనత జగన్ దే: ఇప్పటం సభలో నాగబాబు
- నేడు ఇప్పటంలో జనసేన ఆవిర్భావ దినోత్సవ సభ
- హాజరైన పవన్ కల్యాణ్, నాదెండ్ల, నాగబాబు
- జగన్ దుర్మార్గ పాలన సాగిస్తున్నారని వ్యాఖ్యలు
- రాజధానిపై పైకోర్టుకు వెళ్లొద్దని హితవు
జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభలో ఆ పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యుడు నాగబాబు ప్రసంగించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ పై నాగబాబు విమర్శనాస్త్రాలు సంధించారు. మూడేళ్లు రాజధాని లేకుండా పరిపాలించిన ఘనత మన సీఎం జగన్ కే దక్కుతుందని వ్యాఖ్యానించారు. అయితే రాజధాని రైతుల అకుంఠిత దీక్ష, న్యాయస్థానాల తీర్పులు, జనసేనాని, జనసేన సాగించిన అద్భుత పోరాటం వల్ల ఇవాళ ఏపీకి అమరావతే రాజధాని అని ఖరారైందని తెలిపారు.
జగన్ ఇప్పటికైనా ఈ తీర్పును శిరసావహించి పైకోర్టులకు వెళ్లరాదని సూచించారు. ఇకనైనా మిగిలిన రెండేళ్లు రాజధాని సహితంగా పాలించాలని, లేకపోతే ఐదేళ్ల పాటు రాజధాని లేకుండా పాలించిన ఘనతను సొంతం చేసుకోవాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా నాగబాబు కొంత వ్యంగ్యం ప్రదర్శించారు. డాక్టర్ గారి అబ్బాయి (వైఎస్ తనయుడు జగన్)తో ఏపీ ఆపరేషన్ చేయించుకుందని తెలిపారు.
"నా అనుభవంలో మంచి ముఖ్యమంత్రులను చూశాను, చెడ్డ ముఖ్యమంత్రులను చూశాను. కానీ ఇంత దుర్మార్గమైన పాలన సాగిస్తున్న ముఖ్యమంత్రిని జగన్ నే చూస్తున్నా" అంటూ విమర్శించారు. రాజకీయ దొంగలను కూడా ప్రజలే ఎన్నుకుంటున్నారని, రాజకీయ దొంగలు ప్రజల భవిష్యత్తును దోచుకుంటారని అన్నారు.
జగన్ వచ్చాక ప్రజలకు అప్పులు, తిప్పలు, కష్టాలు, కన్నీళ్లు మిగిలాయని, ఆ బాధలు మరిపించేందుకు కొత్తరకం మద్యం బ్రాండ్లు తీసుకువచ్చారని ఎద్దేవా చేశారు. గోల్డ్ మెడల్ సాధించడం అంటే ఎంతో గొప్ప విషయం అని, కానీ అదేంటో ఏపీలో చాలామంది చేతిలో గోల్డ్ మెడల్ (ఓ లిక్కర్ బ్రాండు) ఉంటోందని వ్యంగ్యం ప్రదర్శించారు. రోజుకో గోల్డ్ మెడల్, కొందరైతే ప్రెసిడెంట్ మెడల్ కూడా సాధిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఏపీలో ప్రతి పౌరుడి మీద లక్ష రూపాయల పైమాటే అప్పు ఉందని, ఇదంతా పౌరులే పన్నుల రూపంలో ఈ అప్పు చెల్లించాల్సి ఉందని అన్నారు.
అసలు, సీఎం జగన్ క్యాబినెట్లోనే కొందరు మంత్రుల పరిస్థితి ఏం బాగాలేదని విమర్శించారు. ఆ మంత్రులకు వారి శాఖలు ఏంటో గుర్తుండవని పేర్కొన్నారు.
కాళ్లు నరికినా, కళ్లు లేకపోయినా బతకొచ్చని, కానీ వెన్నెముక లేకపోతే నిలబడలేమని స్పష్టం చేశారు. అలాంటి వెన్నెముక పవన్ కల్యాణ్ అని ఉద్ఘాటించారు. తన సోదరుడు అని చెప్పడంలేదని, జనం కోసం నిలబడిన పవన్ కల్యాణ్ ప్రస్థానంలో తాను కూడా ఓ అడుగునవుతానంటూ తన ప్రసంగం ముగించారు.
కాగా, జనసేన సభకు ప్రభుత్వం స్థలం ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేసిందని, అయితే రైతులు సభ ఏర్పాటు కోసం తమ పొలాలు ఇచ్చారని వెల్లడించారు. అందుకు రైతులకు సభాముఖంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు నాగబాబు వివరించారు.