Pawan Kalyan: వైసీపీలో బూతులు తిట్టే నేతలే కాదు మేకపాటి వంటి మంచివాళ్లు కూడా ఉన్నారు: పవన్ కల్యాణ్
- ఇప్పటంలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభ
- పేరుపేరునా నమస్కారాలు తెలిపిన పవన్
- అది జనసేన సంస్కారం అని వెల్లడి
జనసేన ఆవిర్భావ దినోత్సవ సభ సందర్భంగా పవన్ కల్యాణ్ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ నేతలు కేసీఆర్, కేటీఆర్ లకు, ఇతర పార్టీల నేతలందరికీ, ఏపీ, తెలంగాణ బీజేపీ నేతలకు, వైసీపీలోని కొందరు నేతలకు కూడా ఆయన హృదయపూర్వక నమస్కారాలు తెలియజేశారు. వైసీపీలో బూతులు తిట్టే నేతలే కాకుండా, ఇటీవల మరణించిన మేకపాటి గౌతమ్ రెడ్డి వంటి మంచి వ్యక్తులు కూడా ఉన్నారని తెలిపారు.
గౌతమ్ రెడ్డి తండ్రి రాజమోహన్ రెడ్డి గారికి కూడా నమస్కారాలు తెలియజేస్తున్నట్టు తెలిపారు. నెల్లూరు జిల్లా వైసీపీ నేత ఆనం రామనారాయణరెడ్డి, తనకు చిన్నప్పటి నుంచి తెలిసిన మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారికి, కళాబంధు టి.సుబ్బిరామిరెడ్డి గారికి కూడా నమస్కారాలు తెలియజేస్తున్నట్టు వివరించారు.
"నమస్కారాల పర్వం పూర్తయింది. మరీ ఇంతమందికి నమస్కారాలా? అని కొందరు అనుకోవచ్చు. అది జనసేన సంస్కారం. ఒక పార్టీని నడపడానికి వేల కోట్లు ఉండాలా? అంటే ఒక బలమైన సిద్ధాంతం ఉండాలని అంటాను. ఇంతమందిని కలిపి ఉంచాలంటే బలమైన సిద్ధాంతం అవసరం. 150 మంది క్రియాశీలక సభ్యులతో ప్రారంభమైన మా ప్రస్థానం ఇవాళ 3 లక్షల 26 వేల సభ్యత్వాలకు పెరిగింది" అని వివరించారు.
2019 సార్వత్రిక ఎన్నికల్లో ఒక్క సీటు గెలిస్తే, అది కాస్తా వైసీపీ వాళ్లు పట్టుకెళ్లారని పవన్ కల్యాణ్ ఆరోపించారు. 2019లో 137 సీట్లలో పోటీ చేస్తే సగటున 7.24 శాతం ఓట్లు లభించాయని, పార్టీ గుర్తుల మీద పోటీ చేసే స్థానిక సంస్థల ఎన్నికల్లో 27.4 శాతం ఓట్లు వచ్చాయని, పంచాయతీ ఎన్నికల్లో 60 శాతం మంది జనసేన మద్దతుతో బరిలో దిగారని తెలిపారు. 1209 సర్పంచులు, 1576 ఉపసర్పంచులు, 4,456 వార్డు మెంబర్లు గెలిచాం అని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 180 ఎంపీటీసీ స్థానాలు, 2 జడ్పీటీసీ స్థానాలు గెలిచామన్నారు.