Nitish Kumar: సీఎం వర్సెస్ స్పీకర్.. బీహార్ అసెంబ్లీలో వాడీవేడీ మాటలు!
- స్పీకర్ స్థానంలో బీజేపీ ఎమ్మెల్యే సిన్హా
- స్పీకర్ పట్ల అమర్యాదగా ప్రవర్తించిన పోలీసులు
- సిన్హా నియోజకవర్గంలో నమోదైన కేసు
- పోలీసులతో పాటు ప్రివిలేజ్ కమిటీ విచారించాలని సిన్హా పట్టు
- కుదరదన్న సీఎం నితీశ్ కుమార్
ప్రస్తుతం పార్లమెంటులో బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. మరోపక్క, పలు రాష్ట్రాలకు చెందిన అసెంబ్లీల్లోనూ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. జరుగుతున్నది బడ్జెట్ సమావేశాలు కాబట్టి... ఈ సమావేశాలు ఎక్కువ రోజులే జరుగుతాయి. అదే అదనుగా అధికార పక్షాన్ని నిలదీసేందుకు విపక్షం.. విపక్షాన్ని దీటుగా ఎదుర్కొనేలా అధికారపక్షం వ్యూహాలు చాలానే ఉంటాయి. అయితే బీహార్ అసెంబ్లీలో మాత్రం సోమవారం నాడు ఓ ఆశ్చర్యకరమైన ఘటన చోటుచేసుకుంది. బీహార్ సీఎం నితీశ్ కుమార్, స్పీకర్ విజయ్ కుమార్ సిన్హాల మధ్య పెద్ద వాగ్యుద్ధమే నడిచింది.
అటు పార్లమెంటు అయినా, ఇటు అసెంబ్లీ అయినా స్పీకర్ స్థానంలో అధికార పార్టీయో, అధికార కూటమికో చెందిన సభ్యులే కొనసాగుతూ ఉంటారు. బీహార్ విషయానికి వస్తే.. ఎన్నికల్లో వేర్వేరుగా పోటీ చేసినా.. ఎన్నికలయ్యాక నితీశ్ పార్టీ అయిన జేడీయూ, బీజేపీల మధ్య పొత్తు కుదిరింది. నితీశ్ వరుసగా మూడోసారి సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టాక, పొత్తులో భాగంగా స్పీకర్‌గా బీజేపీకి చెందిన ఎమ్మెల్యే విజయ్ కుమార్ సిన్హా ఎన్నికయ్యారు. అంతా బాగానే ఉన్నా.. సోమవారం నాటి సమావేశాల్లో మాత్రం నితీశ్, విజయ్ కుమార్ సిన్హాల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్యుద్ధం జరిగింది.
విజయ్ కుమార్ సిన్హా బీహార్‌లోని లఖిసరాయ్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అక్కడ స్పీకర్ హోదాలోని సిన్హా పట్ల పోలీసులు అమర్యాదగా ప్రవర్తించిన వైనంపై ఇటీవలే ఓ కేసు నమోదు అయ్యింది. ఈ కేసు విచారణ రాష్ట్ర పోలీసుల ఆధ్వర్యంలో కొనసాగుతోంది. అదే సమయంలో స్పీకర్‌కు సంబంధించిన కేసు కావడంతో అసెంబ్లీలోని సభా హక్కుల కమిటీ కూడా ఈ కేసు దర్యాప్తును చేపట్టాలని సిన్హా పట్టుబడుతున్నారు. ఈ కేసు విషయంలోనే సీఎం, స్పీకర్‌ల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వివాదానికి దారి తీసింది.