Perni Nani: రాజకీయ జీవితం ఇచ్చిన చిరంజీవికి నమస్కారం పెట్టకపోవడం పవన్ సంస్కారం: పేర్ని నాని సెటైర్
- ఇప్పటంలో జనసేన సభ
- తెలంగాణ, ఏపీ నేతలకు పవన్ నమస్కారాలు
- వైసీపీ నేతలపై తీవ్ర విమర్శలు
- కౌంటర్ ఇచ్చిన పేర్ని నాని
ఏపీ మంత్రి పేర్ని నాని జనసేనాని పవన్ కల్యాణ్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. పవన్ ఇప్పటం సభలో తెలంగాణ నేతలకు, ఏపీ నేతలకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేశారు. దీనిపై పేర్ని నాని సెటైర్ వేశారు. రాజకీయ జీవితం ఇచ్చిన చిరంజీవికి నమస్కారం పెట్టకపోవడం పవన్ సంస్కారం అని వ్యంగ్యం ప్రదర్శించారు. చిరంజీవి లేకుండా పవన్ కల్యాణ్ ఉన్నారా? అని ప్రశ్నించారు. టీడీపీ బాగుండాలనేదే పవన్ ఆకాంక్ష అని, పవన్ ఎప్పుడు తమ పార్టీలోకి దూకుతాడా అని టీడీపీ కార్యకర్తలు ఎదురుచూస్తున్నారని అన్నారు.
ఇవాళ సభలో పవన్ మాట్లాడిన మాటలు వింటుంటే... కంఠం పవన్ ది, భావం చంద్రబాబుది అన్నట్టుగా ఉందని పేర్ని నాని విమర్శించారు. జగన్ మళ్లీ అధికారంలోకి రాకూడదన్నదే పవన్, చంద్రబాబు లక్ష్యం అని తెలిపారు. ప్రత్యేక హోదా ఇవ్వని బీజేపీని పవన్ ఒక్క మాట కూడా అనలేదని ఆరోపించారు. పవన్ కల్యాణ్ ను నడిపించే శక్తి బీజేపీనే అని, అలా కాకపోతే విశాఖ ఉక్కు పరిశ్రమను అమ్మేస్తుంటే ప్రశ్నించాలి కదా! అని వ్యాఖ్యానించారు.
కులాల గురించి మాట్లాడిన పవన్ కల్యాణ్... ఇవాళ వైసీపీలో ఎంతమంది కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు ఉన్నారో, ఎంతమంది కమ్మ ఓటర్లు, ఎంతమంది సానుభూతిపరులు ఉన్నారో గమనించాలని హితవు పలికారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చకూడదని ఇప్పుడే అనిపించిందా? అని పవన్ ను ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ ఓ రాజకీయ ఊసరవెల్లి అని పేర్ని నాని అభివర్ణించారు. వైసీపీకి కమ్మవాళ్లను ఎందుకు దూరం చేయాలని ప్రయత్నిస్తున్నారంటూ నిలదీశారు.