Amarinder Singh: అమరీందర్‌ను వెనకేసుకొచ్చి తప్పుచేశాం: అంగీకరించిన సోనియాగాంధీ
- సీడబ్ల్యూసీ సమావేశంలో పంజాబ్ ఓటమిపై ప్రస్తావన
- అమరీందర్‌ను ప్రతిసారి సమర్థించానని సోనియా విచారం
- ఎప్పుడో తప్పించి ఉంటే పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చి ఉండేదన్న నేతలు
కెప్టెన్ అమరీందర్‌సింగ్‌ను వెనకేసుకొచ్చి తప్పుచేశామని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ అంగీకరించారు. ఐదు రాష్ట్రాలకు ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలైంది. ఈ నేపథ్యంలో ఆదివారం సమావేశమైన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) పలు అంశాలపై చర్చించింది. సోనియాకే పార్టీ పగ్గాలు అప్పగించాలని ఏకగ్రీవంగా నిర్ణయించింది.
ఈ సమావేశంలో పంజాబ్‌లో పార్టీ ఓటమిపై సోనియా మాట్లాడుతూ.. అమరీందర్‌సింగ్‌ను ప్రతిసారి వెనకేసుకొచ్చి తప్పుచేశానని అంగీకరించినట్టు తెలుస్తోంది. ఆ పార్టీ పంజాబ్ ఇన్‌చార్జ్ హరీశ్ చౌదరి మాట్లాడుతూ.. అమరీందర్‌ను ఆలస్యంగా తప్పించడం కూడా పార్టీ ఓటమికి ప్రధాన కారణమని అన్నారు. అమరీందర్‌ను కనుక తొలగించాలని అధిష్ఠానం కోరుకుని ఉంటే ఆ పని ముందే చేసి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. అలా చేసి ఉంటే ఎన్నికల సమయానికి ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత మాయమై ఉండేదని ఇంకో నేత అన్నారు.
దీంతో స్పందించిన సోనియా గాంధీ ఈ విషయంలో తన తప్పు కూడా ఉందని, అమరీందర్‌పై ఫిర్యాదులు వచ్చిన ప్రతిసారి తాను ఆయనను సమర్థిస్తూ వచ్చానని అన్నారు. అది తన తప్పేనని అంగీకరించారు. కాగా, తనను తప్పించి చరణ్‌జీత్ సింగ్ చన్నీకి ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించడంతో కినుక వహించిన అమరీందర్ పార్టీకి రాజీనామా చేసి సొంత కుంపటి పెట్టుకున్నారు. బీజేపీతో పొత్తుపెట్టుకుని ఎన్నికల బరిలోకి దిగారు. అయితే, ‘ఆప్’ జోరు ముందు మరేపార్టీ నిలవలేకపోయింది. కాగా, ఈ ఎన్నికలలో పటియాలా నుంచి బరిలోకి దిగిన అమరీందర్.. ఆప్ అభ్యర్థి చేతిలో 19,873 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు.