Pakistan: 148 పరుగులకే కుప్పకూలిన పాకిస్థాన్.. ఫ్యాన్స్ షాక్.. వీడియో ఇదిగో

Shell Shocked Fans In Karachi pcb shares video

  • రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 148 పరుగులకే కుప్పకూలిన పాక్
  • ఆసీస్ పేస్ దళం ముందు నిలవలేకపోయిన పాక్ బ్యాటర్లు
  • అభిమానుల రియాక్షన్‌ను షేర్ చేసిన పీసీబీ

ఆస్ట్రేలియాతో స్వదేశంలో జరుగుతున్న రెండో టెస్టులో పాకిస్థాన్ తన తొలి ఇన్నింగ్స్‌లో 148 పరుగులకే కుప్పకూలడం అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. కరాచీలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియన్ పేస్ దళం ముందు పాక్ బ్యాటర్లు తలవంచారు. మిచెల్ స్టార్క్, పాట్ కమిన్స్ దెబ్బకు పాక్ ఆటగాళ్లు గింగిరాలు తిరిగారు. వికెట్లను టపటపా సమర్పించుకుని వెనుదిరిగారు. పాక్ బ్యాటింగ్ పతనాన్ని జీర్ణించుకోలేని అభిమానులు షాక్‌లోకి వెళ్లిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తెగ చక్కర్లు కొడుతోంది.

ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా తన తొలి ఇన్నింగ్స్‌ను 556/9 వద్ద డిక్లేర్ చేసింది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన పాక్ బ్యాటింగ్ ఆర్డర్ ఆసీస్ బౌలర్ల దెబ్బకు గతి తప్పింది. వారికి కోలుకునే అవకాశమన్నదే ఇవ్వకుండా బౌలర్లు చెలరేగారు. ముఖ్యంగా స్టార్క్ పదునైన బంతులతో బ్యాటర్లను భయపెట్టాడు. మూడు వికెట్లు పడగొట్టి పాక్‌ను తీవ్రంగా దెబ్బకొట్టాడు. స్వెప్సన్ రెండు వికెట్లు తీసుకోగా, కమిన్స్, నాథన్ లయన్, గ్రీన్ తలో వికెట్ తీసుకున్నారు. 

పాక్ బ్యాటర్లలో ఐదుగురు పట్టుమని పది పరుగులు కూడా చేయలేకపోయారు. కెప్టెన్ బాబర్ ఆజం చేసిన 36 పరుగులే ఆ జట్టులో అత్యధికం. 148 పరుగులకు ఆలౌటైన పాక్‌తో ఆసీస్ ఫాలోఆన్ ఆడించింది. మూడో రోజు ఆటముగిసే సమయానికి పాక్ వికెట్ నష్టానికి 81 పరుగులు చేసింది.

కాగా, ఈ మ్యాచ్‌లో పాక్ వికెట్లు వరుసపెట్టి పడుతుంటే అభిమానులు షాకవుతున్న వీడియోను పాక్ క్రికెటర్ బోర్డు (పీసీబీ) తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసింది. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మీరూ చూసేయండి.

  • Loading...

More Telugu News