Hijab: హిజాబ్ మత ఆచారం కాదు.. విద్యార్థులు యూనిఫాంలో రావడమే సహేతుకం: కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు
- నెల రోజుల వివాదానికి తెరదించేసిన కోర్టు
- యూనిఫాంపై అభ్యంతరాలు వద్దన్న కోర్టు
- విరుద్ధంగా ఎవరూ నడుచుకోజాలరు
- అన్ని పిటిషన్లనూ కొట్టివేసిన ఫుల్ బెంచ్
- తీర్పుపై సుప్రీంకు వెళ్లనున్న పిటిషనర్లు
- సీజే ఇంటి ముందు బందోబస్తు పెంపు
హిజాబ్ వివాదంపై కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. నెల రోజులుగా ఘర్షణాత్మక వాతావరణానికి కారణమైన హిజాబ్ వివాదానికి తెర దించింది. హిజాబ్ ధరించడం మత ఆచారం కాదని తేల్చి చెప్పింది. క్లాసు రూముల్లో హిజాబ్ వేసుకురావడంపై విధించిన నిషేధాన్ని సవాల్ చేస్తూ విద్యార్థులు కోర్టుకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఐదు వ్యాజ్యాలు దాఖలు చేశారు.
ఆ పిటిషన్లన్నింటినీ సమగ్రంగా విచారించిన కర్ణాటక హైకోర్టు చీఫ్ జస్టిస్ రీతూ రాజ్ అవస్థి, జస్టిస్ కృష్ణ ఎస్. దీక్షిత్, జస్టిస్ జె.ఎం. ఖాజీల నేతృత్వంలోని హైకోర్టు బెంచ్.. ఇవాళ వాటిని కొట్టేసింది. మతపరమైన దుస్తులను వేసుకురావడానికి బదులు విద్యార్థులంతా యూనిఫాంను వేసుకురావడమే సహేతుకమని స్పష్టం చేసింది.
‘‘ముస్లిం మహిళలు హిజాబ్ వేసుకోవాలనేది మత ఆచారం కాదు. ఇస్లామిక్ విశ్వాసం కూడా కాదు. విద్యార్థులెవరూ యూనిఫాంపై అభ్యంతరాలు వ్యక్తం చేయరాదు. విద్యాసంస్థలు నిర్దేశించిన యూనిఫాంను ధరించే స్కూలుకు రావాల్సి ఉంటుంది. యాజమాన్యాలు విద్యార్థులకు యూనిఫాంను పెట్టడం సహేతుకమైన చర్యే. అది యాజమాన్యాల ప్రాథమిక హక్కు. కాబట్టి అందుకు విరుద్ధంగా ఎవరైనా ప్రవర్తిస్తే చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వానికి అన్ని అధికారాలూ ఉంటాయి. జీవోలనూ పాస్ చేయవచ్చు’’ అని తేల్చి చెప్పింది.
హిజాబ్ లను ధరించి వచ్చిన విద్యార్థులను లోపలికి అనుమతించని కాలేజీ ప్రిన్సిపాల్, అధ్యాపకులు, ఉడుపి కాలేజీ అభివృద్ధి కమిటీ చైర్మన్ (స్థానిక ఎమ్మెల్యే), వైస్ చైర్మన్ లను తొలగించాలన్న విద్యార్థుల అభ్యర్థనను ధర్మాసనం తోసిపుచ్చింది.
కాగా, తీర్పు నేపథ్యంలో శాంతి భద్రతలను దృష్టిలో పెట్టుకుని వారం రోజుల పాటు బెంగళూరులో భారీ సభలు, సమావేశాలపై కర్ణాటక ప్రభుత్వం నిషేధం విధించిన సంగతి తెలిసిందే. మంగళూరులోనూ మార్చి 15 నుంచి 19 వరకు ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. ఇక, ఇవాళ ఉడుపిలో స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించారు.
స్కూళ్లు, కాలేజీ ఇతర విద్యాసంస్థల్లో మతసంబంధమైన దుస్తులు ధరించడాన్ని గత నెల 5న కర్ణాటక ప్రభుత్వం నిషేధించింది. ఈ క్రమంలోనే ఉడుపిలోని పీయూసీ కాలేజీలో హిజాబ్ ధరించి వచ్చిన విద్యార్థినులను యాజమాన్యం అనుమతించలేదు. ఆ ఘటన చిలికి చిలికి గాలివానలా మారింది. ఒక కాలేజీ నుంచి మరో కాలేజీకి పాకింది. హిజాబ్ కు పోటీగా హిందూ విద్యార్థులు కాషాయ కండువాలతో స్కూళ్లు, కాలేజీలకు వెళ్లారు. దీంతో సమస్య కాస్తా పెద్దదైంది. విద్యార్థులు కాలేజీల ముందు ఆందోళన చేసే దాకా పరిస్థితి వెళ్లింది.
కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై కొందరు విద్యార్థులు హైకోర్టుకు వెళ్లారు. పిటిషన్లను విచారించిన హైకోర్టు ఫిబ్రవరి 10న.. అన్ని మతపరమైన దుస్తులపై తాత్కాలిక నిషేధం విధించింది. అప్పట్నుంచి పలు దఫాలుగా ఆయా పిటిషన్లపై విచారణ జరిపిన కోర్టు.. తీర్పును ఇవాళ్టికి వాయిదా వేసింది. తాజాగా తీర్పును వెలువరించింది.
కాగా, తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేయాలని పిటిషనర్లు నిర్ణయించారు. ప్రస్తుతం ఈ అంశంపై చర్చలు జరుపుతున్నామని, తీర్పు పూర్తి కాపీ అందిన తర్వాత దానిని విశ్లేషించి ఏం చేయాలనే దానిపై నిర్ణయం తీసుకుంటామని పిటిషనర్ల తరఫు అడ్వొకేట్ షాహుల్ చెప్పారు. తీర్పు నేపథ్యంలో బెంగళూరులోని హైకోర్టు చీఫ్ జస్టిస్ రీతూ రాజ్ ఇంటి వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. బందోబస్తును పెంచారు.