Gir forest: గిర్ అభయారణ్యంలో సింహాల మరణ మృదంగం
- మన దేశంలో దాదాపు సింహాలన్నీ అక్కడే
- 2020 నాటికి మొత్తం 674 సింహాలు
- సహజ కారణాలేనంటున్న రాష్ట్ర సర్కారు
- ఇతర కారణాలను ప్రస్తావిస్తున్న నిపుణులు
అడవికి రాజు అయిన సింహం ఒంటరి అయిపోతోంది. వాటి సంతతి మరీ తరిగిపోతోంది. గుజరాత్ రాష్ట్రంలోని గిర్ అభయారణ్యంలో గడిచిన రెండేళ్లలో ఏకంగా 283 సింహాలు మృత్యువాత పడ్డాయి. వాటిల్లో 142 కూనలు కూడా ఉన్నాయి. గుజరాత్ రాష్ట్ర సర్కారు స్వయంగా ఈ గణాంకాలను వెల్లడించింది.
వీటి మరణానికి సహజ, అసహజ కారణాలను ప్రస్తావించింది. సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా రాష్ట్ర సర్కారు అసెంబ్లీకి ఈ వివరాలు సమర్పించింది. గిర్ అభయారణ్యంలో 2020 నాటికి మొత్తం 674 సింహాలున్నాయి. అదే ఏడాది 159 సింహాలు మరణించాయి. 2021లోనూ 124 మృత్యువాత పడ్డాయి. దీంతో రెండేళ్లలోనే 283 సింహాలను రాష్ట్రం నష్టపోయింది.
ఈ మరణాలకు కెనైన్ డిస్టెంపర్ వైరస్ అనేది ఎక్కువగా కారణంగా ఉందని సమాచారం. కుళ్లిపోయిన పశు మాంసాన్ని తీసుకొచ్చి గిర్ లోని సింహాలకు ఆహారంగా ఇవ్వడంతో అవి చనిపోతున్నట్టు నిపుణులు ఆరోపిస్తున్నారు. ఎన్నో కారణాలతో సింహాలు మృత్యువాత పడుతున్నా.. మరోవైపు ఏటా అక్కడ 150-160 కూనలు కళ్లు తెరుచుకుంటుండడంతో వాటి సంతతి చెప్పుకోతగ్గ స్థాయిలో కొనసాగుతోంది.