fasting: ఉపవాస సమయంలో ఏం తినొచ్చు?
- ఉపవాసంతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు
- ఆయుర్వేదంలోనూ దీనికి ప్రాధాన్యం
- ఉపవాస సమయంలో జంక్ ఫుడ్ వద్దు
- ద్రవ పదార్థాలు తీసుకోవచ్చంటున్న వైద్యులు
ఫాస్టింగ్ అంటే నిర్ణీత సమయం పాటు కడుపును ఖాళీగా ఉంచడం. దీనివల్ల కాలేయం, జీర్ణ వ్యవస్థకు విశ్రాంతి లభిస్తుంది. మన సమాజంలో ఉపవాస నియమాన్ని చాలా మంది పాటిస్తుంటారు. అటువంటి సమయంలో నీరు తప్ప మరేదీ ముట్టని వారే కాకుండా.. అల్పాహారాన్ని తీసుకునే వారు కూడా కనిపిస్తారు.
ఉపవాసం అన్నది 12 నుంచి 24 గంటల పాటు సాగే నియమం. ఇందులోనూ చాలా రకాలున్నాయి. పేగుల ఆరోగ్యం కోసం, శరీరంలో ఉన్న వ్యర్థాలను బయటకు పంపేందుకు వీలుగా ఆయుర్వేదం ఉపవాసాన్ని ఆచరించమనే చెబుతోంది. ‘‘ఫాస్టింగ్ అన్నది భౌతికంగానే కాదు మానసిక ఆరోగ్యానికీ సాయపడుతుంది. ఒబెసిటీ, అధిక కొలెస్ట్రాల్, కాలేయ సమస్యలు ఇలా ఎన్నింటికో ఉపవాసం పరిష్కారం చూపిస్తుంది’’అని ఆయుర్వేద డాక్టర్ దీక్షా భావ్ సార్ చెప్పారు.
ఉపవాసం సమయంలో పండ్లు, నట్స్ (కాయ గింజలు), కొబ్బరి నీరు, చెరకు రసం, పాలు, పెరుగు, మజ్జిగ, రాజ్ గిరా, సాబుదానా, చిలగడ దుంపలు, ఉడికించిన బంగాళాదుంపలను తీసుకోవచ్చని దీక్ష తెలిపారు. ఫాస్టింగ్ అన్నది ఒక్కొక్కరికి ఒక్కో విధంగా ఫలితాలనిస్తుందని ఆమె పేర్కొన్నారు. శరీర తత్వానికి సరిపడే ఫాస్టింగ్ ఆచరించడం కూడా మంచి ఫలితాలకు దారితీస్తుందన్నారు.
ఉప్పు, తీపి పదార్థాలకు దూరంగా ఉండడం, కేవలం నీరు తీసుకునే ఉండడం, ద్రవ పదార్థాలు(పండ్ల రసం, పాలు), ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ (ఆహారానికి, ఆహారానికి మధ్య సుదీర్ఘ విరామం ఇవ్వడం) ఇలా ఎన్నో ఫాస్టింగ్ లు ఉన్నాయి. అయితే ఫాస్టింగ్ ఉన్న వారు జంక్ ఫుడ్ తీసుకోవద్దని వైద్యుల సూచన.