Narendra Modi: ప్రధాని మోదీతో కోమటిరెడ్డి భేటీ.. సింగరేణిలో స్కామ్‌పై ఫిర్యాదు
- పార్లమెంటు ఆవరణలోనే భేటీ
- భువనగిరి అభివృద్దిపై వినతులు
- సింగరేణిలో పెద్ద స్కాం అంటూ కంప్లైంట్
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సోమవారం నాడు ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. పార్లమెంటు బడ్జెట్ మలిదశ సమావేశాల్లో భాగంగా సోమవారమే ఢిల్లీ చేరుకున్న కోమటిరెడ్డి.. తొలి రోజు సమావేశాలు ముగిసిన సమయంలో పార్లమెంటు ఆవరణలోనే ప్రధానితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తన నియోజకవర్గ పరిధిలోని పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేయాలని కోరడంతో పాటు ఓ పెద్ద కుంభకోణంపై మోదీకి ఫిర్యాదు చేశారు.
తెలంగాణలోని సింగరేణి బొగ్గు గనుల్లో ఏకంగా రూ.50 వేల కోట్లకు పైగా నిధుల మేర భారీ స్కామ్ జరిగిందని ప్రధానికి కోమటిరెడ్డి తెలియజేశారు. ఈ కుంభకోణానికి సంబంధించి ఇప్పటిదాకా చిన్న విషయం కూడా బయటకు రాలేదని, అయితే స్కాం జరిగిన మాట వాస్తవమేనని ఆయన ఆధారాలతో సహా ప్రధానికి తెలియజేశారు. ఈ మేరకు ప్రధానిని కలిసిన విషయాన్ని.. ఆయనకు తానేం చెప్పానన్న వివరాలను కోమటిరెడ్డే స్వయంగా తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు.