CPI Ramakrishna: అప్పుడు 'పాచిపోయిన లడ్డూ' అన్న పవన్‌కు ఇప్పుడు లడ్డూల టేస్ట్ మారిందా?: సీపీఐ రామకృష్ణ
- అదానీకి ఆస్తులు అప్పగిస్తున్నాడంటూ రామకృష్ణ ఆరోపణలు
- మోదీ, అమిత్ షాల డైరెక్షన్‌లో జగన్ నడుస్తున్నారంటూ విమర్శలు
- రోడ్ మ్యాప్ ఇవ్వమంటున్న పవన్‌పై ఆగ్రహం
- చేవ చచ్చిన నాయకులు వస్తున్నారంటూ ఫైర్
ఆంధ్రప్రదేశ్‌ను జగన్ అదానీ ప్రదేశ్‌గా మారుస్తున్నారని సీపీఐ రామకృష్ణ విమర్శలు గుప్పించారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా డైరెక్షన్ లో ఏపీ ఆస్తులను అదానీకి అప్పగిస్తున్నారని కూడా ఆయన ఆరోపించారు. ప్రధాని మోదీ, అమిత్ షా, జగన్, అదానీ కలిసి మాట్లాడుకుని రాష్ట్రంలో సంపద కొల్లగొడుతున్నారని ఆయన మండిపడ్డారు.
ఓపక్క మోదీ, అమిత్ షా డైరెక్షన్‌లో సీఎం జగన్ నడుస్తుంటే… మరోపక్క ఇప్పుడు రోడ్ మ్యాప్ ఇవ్వమని బీజేపీ నాయకుల్ని పవన్ కల్యాణ్ అడుగుతున్నాడని ఆయన విమర్శించారు. బీజేపీ నాయకుల డైరెక్షన్‌లో పని చేస్తున్న జగన్ ని దించి, తనకు రోడ్డు మ్యాప్ ఇవ్వమని పవన్ అడగడంపై రామకృష్ణ విస్మయం వ్యక్తం చేశారు.
రాష్ట్రానికి బీజేపీ పాచిపోయిన లడ్డు ఇచ్చిందని గతంలో చెప్పిన పవన్‌కు ఇప్పుడు లడ్డూల టేస్ట్ మారిందా? అని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో చేవ చచ్చిన నాయకులు ముందుకు వస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రానికి కేంద్రం చేస్తున్న అన్యాయంపై పోరాటం చేసేందుకు అన్ని పార్టీలు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. జగన్ అప్రజాస్వామిక పోకడలపై తాము అలుపెరగని పోరు సాగిస్తామని రామకృష్ణ ప్రకటించారు.