China: రష్యాకు సాయం చేయొద్దంటూ అమెరికా హెచ్చరించడంపై చైనా స్పందన
- ఉక్రెయిన్ పై కొనసాగుతున్న రష్యా దాడులు
- చైనాను సాయం కోరిన రష్యా
- అత్యాధునిక డ్రోన్లు అందించాలని విజ్ఞప్తి
- సాయం చేస్తే కఠినచర్యలు తప్పవన్న అమెరికా
- తమకు అలాంటి ఉద్దేశం లేదన్న చైనా
ఉక్రెయిన్ పై తీవ్రస్థాయిలో విధ్వంసానికి పాల్పడుతున్న రష్యా... సాయుధ డ్రోన్ల కోసం చైనా సాయం కోరిన సంగతి తెలిసిందే. అయితే, రష్యాకు సాయం చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని చైనాను అమెరికా కటువుగా హెచ్చరించింది. దీనిపై చైనా స్పందించింది. రష్యా యుద్ధం నేపథ్యంలో తాము సంక్షోభంలో భాగస్వామిగా మారాలని అనుకోవడంలేదని చైనా పేర్కొంది. అమెరికా ఆంక్షలను ఎదుర్కోవాలని కోరుకోవడంలేదని స్పష్టం చేసింది.
చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి మాట్లాడుతూ... "మా దేశానికి నష్టం కలిగే ఏ చర్యలు తీసుకోం. అసలు, చైనా అలాంటి దేశమే కాదు. ఏ సంక్షోభాన్ని కూడా ప్రోత్సహించదు. అదే సమయంలో తన చట్టబద్ధమైన హక్కులు, ప్రయోజనాలను కాపాడుకునే హక్కు చైనాకు ఉంది" అని పేర్కొన్నారు. స్పెయిన్ విదేశాంగ మంత్రి జోన్ మాన్యుయేల్ అల్బారెస్ తో ఫోన్ సంభాషణ సందర్భంగా వాంగ్ యి ఈ వ్యాఖ్యలు చేశారు.