Hijab: సుప్రీంకోర్టుకు చేరిన హిజాబ్ వివాదం
- విద్యా సంస్థల్లోకి హిజాబ్ సరికాదన్న హైకోర్టు
- తమకు న్యాయం జరగలేదన్న పిటిషనర్లు
- ఆ వెంటనే సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు
కర్ణాటకలో ప్రకంపనలు సృష్టించిన హిజాబ్ వివాదం తాజాగా సుప్రీంకోర్టు గడప తొక్కింది. విద్యాలయాల్లోకి హిజాబ్‌ను అనుమతించేది లేదన్న ఉడుపి విద్యా సంస్థ ఆదేశాలను కొట్టేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను కర్ణాటక హైకోర్టు మంగళవారం ఉదయం కొట్టేసిన సంగతి తెలిసిందే. ఈ తీర్పుతో తమకు న్యాయం జరగలేదని పిటిషనర్లు ఇప్పటికే అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ క్రమంలో కర్ణాటక హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ నేటి సాయంత్రం పిటిషనర్లు సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తలుపు తట్టారు. వెరసి ఈ వివాదం ఇప్పుడు సుప్రీంకోర్టుకు చేరింది. ఇదిలావుంచితే, కర్ణాటక హైకోర్టులో ఈ వివాదంపై విచారణ జరుగుతున్న సమయంలోనే కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.
అయితే నాడు ఈ పిటిషన్‌ను తీరస్కరించిన సుప్రీంకోర్టు.. దీనిపై హైకోర్టులో విచారణ జరుగుతున్నందున తాను విచారణ చేపట్టాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది. ఒకవేళ హైకోర్టు తీర్పుపై అసంతృప్తి ఉంటే అప్పుడు తమను ఆశ్రయించవచ్చని తెలిపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే హైకోర్టు తీర్పు వెలువడిన కొద్ది గంటల్లోనే పిటిషనర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.