Karnataka: హిజాబ్ వివాదంపై అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు నిరాకరణ
- ఉడుపి జిల్లాలో మొదలైన వివాదం
- కర్ణాటక హైకోర్టులో సుదీర్ఘ విచారణ
- హిజాబ్‌కు అనుమతి నిరాకరిస్తూ తీర్పు
- సుప్రీంకోర్టును ఆశ్రయించిన విద్యార్థులు
కర్ణాటకలో చెలరేగిన హిజాబ్ వివాదంపై అత్యవసర విచారణ చేపట్టేందుకు సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు నిరాకరించింది. హోలీ సెలవుల తర్వాత ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టనున్నట్లు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం తెలిపింది.
కర్ణాటకలోని ఉడుపి జిల్లాలోని ఓ విద్యాలయం యాజమాన్యం హిజాబ్‌తో వచ్చిన విద్యార్థులను నిలిపేసింది. హిజాబ్ తీసేసి.. స్కూల్ డ్రెస్‌తో మాత్రమే విద్యాలయంలోకి ప్రవేశించాలని ఆదేశించింది. దీనికి నిరాకరించిన విద్యార్థులు కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. అదే సమయంలో హిజాబ్‌ను విద్యాలయాల్లో నిషేధించాలంటూ మరికొందరు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. దీంతో ఈ పిటిషన్లన్నింటినీ కలిపి హైకోర్టు విచారణ చేపట్టింది.
ఈ వివాదంపై మంగళవారం కర్ణాటక హైకోర్టు తీర్పు వెలువరించింది. విద్యాలయాల్లోకి హిజాబ్‌ను అనుమతించడానికి వీల్లేదంటూ కోర్టు తీర్పు చెప్పిన సంగతి తెలిసిందే. హైకోర్టు తీర్పుతో తమకు న్యాయం జరగలేదని భావించిన విద్యార్థులు మంగళవారమే సుప్రీంకోర్టు తలుపు తట్టారు. ఈ పిటిషన్‌ను అత్యవసరంగా విచారణ చేపట్టాలని కోరారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు దీనిపై అత్యవసర విచారణ అవసరం లేదని, హోలీ సెలవుల తర్వాత విచారణ చేపడతామని తేల్చి చెప్పింది.