Punjab: పంజాబ్ సీఎంగా భగవంత్ మాన్ ప్రమాణం.. మనకు ఓటు వేయని వారిపై ద్వేషం చూపద్దన్న సీఎం
- భగత్ సింగ్ పుట్టిన ఊరిలో ప్రమాణం
- వేలాదిగా తరలివచ్చిన జనం
- పసుపు రంగు తలపాగాలతో మద్దతు
- కేజ్రీవాల్ సహా పలువురు ప్రముఖుల హాజరు
పంజాబ్ ముఖ్యమంత్రిగా భగవంత్ మాన్ ప్రమాణం చేశారు. ఇవాళ మధ్యాహ్నం ఆయన సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. భగత్ సింగ్ పుట్టిన గ్రామమైన నవన్ షహర్ జిల్లాలోని ఖాట్కర్ కలాన్ లో ఆయన ప్రమాణం చేశారు. ఇంక్విలాబ్ జిందాబాద్ అన్న భగత్ సింగ్ నినాదంతోనే తన ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ముగించారు.
ప్రమాణ స్వీకారం అనంతరం తన సహచర ఎమ్మెల్యేలకు పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ఓ విజ్ఞప్తి చేశారు. ‘‘మనకు ఓటు వేయని ప్రజలపై కోపం, విద్వేషం చూపించవద్దు. వారినీ మనం గౌరవించి తీరాల్సిందే. మీ అందరికీ, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కు నా కృతజ్ఞతలు’’ అని అన్నారు.
ఆమ్ ఆద్మీపార్టీ (ఆప్) చీఫ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా సహా పలువురు ప్రముఖులు భగవంత్ మాన్ ప్రమాణ కార్యక్రమానికి హాజరయ్యారు. వేలాది మంది ప్రజలు ఆయన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి విచ్చేశారు. పసుపు రంగు తలపాగాలు చుట్టుకుని భగవంత్ మాన్ కు మద్దతు తెలిపారు. కేజ్రీవాల్, సిసోడియా కూడా పసుపు రంగు పాగాల్లో రావడం విశేషం. ప్రమాణ స్వీకార వేదిక వద్ద పది వేల మంది పోలీసులతో బందోబస్తును ఏర్పాటు చేశారు.
కాగా, ఇటీవల జరిగిన ఎన్నికల్లో 117 స్థానాల్లో పోటీ చేసిన ఆప్.. 92 స్థానాలను గెలిచి అధికారాన్ని కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్, బీజేపీ, ఇతర ముఖ్య పార్టీలను పంజాబ్ గడ్డపై ఆ పార్టీ మట్టికరిపించింది. సంగ్రూర్ జిల్లా ధూరీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన భగవంత్ మాన్.. కాంగ్రెస్ అభ్యర్థి దల్వీర్ సింగ్ గోల్డీపై 58 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.