Corona Virus: మళ్లీ కలవరపెడుతున్న కరోనా.. ఫోర్త్ వేవ్ వస్తుందని నిపుణుల హెచ్చరిక!
- చైనాలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు
- ఇండియాకు కూడా ముప్పు తప్పేలా లేదంటున్న నిపుణులు
- ఫోర్త్ వేవ్ ప్రభావం 75 శాతం మందిపై పడొచ్చని అంచనా
ఇండియాలో క్రమంగా కరోనా కేసులు తగ్గిపోతుండడంతో అందరూ ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇక కరోనా కథ ముగిసిపోయిందనే సంతోషంలో ఉన్నారు. అయితే, కరోనా కథ ఇంకా ముగిసిపోలేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చైనాలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటంతో ప్రపంచం మళ్లీ ఉలిక్కిపడుతోంది.
చైనాలో పెరుగుతున్న కేసులను చూస్తుంటే... ఇండియాకు మరోసారి కరోనా ముప్పు తప్పేలా లేదని నిపుణులు భావిస్తున్నారు. ఈ సారి కరోనా ఏకంగా 75 శాతం మందిపై పడొచ్చని కోవిడ్ 19 టాస్క్ గ్రూపుకు నేతృత్వం వహిస్తున్న డాక్టర్ ఎన్కే అరోరా కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా బీఏ.2 వేరియంట్ వల్ల మూడో వేవ్ వచ్చిందని... ఇప్పటికీ ఆ వేరియంట్ ఆనవాళ్లు ఉండటం వల్ల ఫోర్త్ వేవ్ వచ్చే అవకాశం ఉందని చెప్పారు. మరోవైపు జులైలో నాలుగో వేవ్ దశ ప్రారంభమవుతుందని ఐఐటి ఖరగ్ పూర్ అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.