Congress: వారిది పార్టీని చీల్చే యత్నమే!.. అసంతృప్త నేతల భేటీపై ఖర్గే!
- ఆజాద్ ఇంటిలో సిబల్ ఇతర నేతల భేటీపై ఖర్గే అసహనం
- ఢిల్లీ నుంచి గల్లీ దాకా సోనియా వెంటేనని వెల్లడి
- పార్టీని చీల్చడం వారి తరం కాదని వ్యాఖ్య
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలవడంతో కాంగ్రెస్ పార్టీలో కీలక పరిణామాలే చోటుచేసుకునేలా ఉన్నాయి. పార్టీకి చెందిన సీనియర్లంతా గాంధీ ఫ్యామిలీ నేతృత్వంపై నిరసన గళం విప్పుతున్నారు. ఇందులో భాగంగా బుధవారం కేంద్ర మాజీ మంత్రి కపిల్ సిబల్ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్‌లో పెను తుపానునే రేపాయి. తాజాగా బుధవారం సాయంత్రం మరో మాజీ మంత్రి గులాం నబీ ఆజాద్ ఇంటిలో సిబల్ సహా చాలా మంది సీనియర్లు ప్రత్యేకంగా భేటీ అయ్యారు.
ఈ భేటీపై గాంధీ ఫ్యామిలీకి వీర విధేయుడిగా ముద్రపడిన మల్లికార్జున ఖర్గే స్పందించారు. అసంతృప్త నేతలు వంద సమావేశాలు పెట్టుకున్నా..పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి వచ్చిన ఇబ్బందేమీ లేదని ఆయన వ్యాఖ్యానించారు. గల్లీ నుంచి ఢిల్లీ దాకా అందరూ సోనియా గాంధీ వెంటే ఉన్నారని ఆయన అన్నారు. సోనియా గాంధీని అసంతృప్త నేతలు బలహీనపరచలేరని కూడా ఆయన వ్యాఖ్యానించారు.
పార్టీ ఓటమికి కారణాలపై సీడబ్ల్యూసీలో చర్చించిన మీదటే బాధ్యులపై చర్యలు తీసుకున్నారని ఆయన చెప్పారు. ఓ వైపు చర్యల కత్తి దూస్తున్నా.. అసంతృప్త నేతలు ఇంకా సమావేశాలు నిర్వహిస్తున్నారంటే.. వారు పార్టీని చీల్చేందుకే యత్నిస్తున్నట్లుగా కనిపిస్తోందని ఖర్గే అసహనం వ్యక్తం చేశారు. అసంతృప్త నేతలు ఎన్ని కుయుక్తులు పన్నినా పార్టీని చీల్చడం వారి తరం కాదని కూడా ఖర్గే వ్యాఖ్యానించారు.