Gautam Adani: ఆ లెక్కన.. అదానీ సంపాదన రోజుకు 1000 కోట్ల రూపాయలు!
- గతేడాది ఏకంగా రూ. 3.67 లక్షల కోట్ల సంపాదన
- 103 బిలియన్ డాలర్ల సంపదతో అత్యంత సంపన్న భారతీయుడిగా ముకేశ్ అంబానీ
- ప్రపంచ కుబేరుల జాబితాలో 9, 12వ స్థానాల్లో అంబానీ, అదానీ
- జాబితా విడుదల చేసిన ‘ఎం3ఎం’
అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ తన సంపద విలువను అమాంతం పెంచుకుంటూ పోతున్నారు. ఈ క్రమంలో దిగ్గజాలను సైతం వెనక్కి నెట్టేస్తున్నారు. 2021లో అదానీ ఏకంగా 49 బిలియన్ డాలర్లు.. మన కరెన్సీలో చెప్పాలంటే దాదాపు 3.67 లక్షల కోట్లను తన సంపదకు జోడించారు. అంటే రోజుకు సగటున 1000 కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. ప్రపంచంలోని టాప్-3 బిలియనీర్లు అయిన ఎలాన్ మస్క్, జెఫ్ బెజోస్, బెర్నార్డ్ ఆర్నాల్ట్ పెంచుకున్న సంపదతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ కావడం గమనార్హం. ఈ మేరకు రియల్ ఎస్టేట్ గ్రూప్ ఎం3ఎం హరూన్ గ్లోబల్ రిచ్‌లిస్ట్ 2022’ ప్రకటించింది.
రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ 103 బిలియన్ డాలర్ల సంపదతో అత్యంత సంపన్న భారతీయుడిగా ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు. 2020తో పోలిస్తే ఆయన సంపద 24 శాతం మేర పెరిగింది. గౌతమ్ అదానీ సంపద ఏకంగా 153 శాతం పెరిగి 81 బిలియన్ డాలర్ల (దాదాపు రూ. 6.07 లక్షల కోట్లు)కు పెరిగింది. దీంతో ఆయన అంబానీ తర్వాతి స్థానంలో నిలిచారు. ఇక, ప్రపంచ సంపన్నుల జాబితాలో అంబానీ 9, అదానీ 12వ స్థానాల్లో ఉన్నారు. హెచ్‌సీఎల్ కంపెనీ ప్రమోటర్ శివ్‌నాడార్ 28 బిలియన్ డాలర్ల సంపదతో మూడో స్థానంలో ఉన్నారు. ప్రపంచ జాబితాలో ఆయనది 46వ స్థానం.
26 బిలియన్ డాలర్లతో సీరం ఇనిస్టిట్యూట్ ఇఫ్ ఇండియా ఎండీ సైరస్ పూనావాలా, 25 బిలియన్ డాలర్ల సంపదతో లక్ష్మీ నివాస్ మిట్టల్ వరుసగా నాలుగైదు స్థానాల్లో ఉన్నారు. అలాగే, డిమార్ట్ అధినేత రాధాకిషన్ దమానీ, హిందూజా గ్రూప్ అధిపతి ఎస్పీ హిందూజా 23 బిలియన్ డాలర్ల సంపదతో టాప్-100 సంపన్నుల జాబితాలో చోటు దక్కించుకున్నారు.