Jayalalitha: జయలలిత అసలు వారసురాలిని నేనే.. వారసత్వ సర్టిఫికెట్ ఇవ్వండి: తహసీల్దార్ కార్యాలయంలో మధురై మహిళ హల్‌చల్
- చిన్నప్పుడే నన్ను వదిలేశారు
- పళనిలో బంగారు రథం లాగే హక్కును శోభన్‌బాబు తనకు ఇచ్చారన్న మహిళ
- వారసత్వ సర్టిఫికెట్ ఎందుకివ్వరని ప్రశ్న
- కోర్టుకెళ్లి తేల్చుకోవాలన్న అధికారులు
జయలలిత మృతి తర్వాత ఆమె వారసులం తామేంటూ పలువురు వెలుగులోకి వచ్చారు. కోర్టుల వరకు వెళ్లారు. ఆ తర్వాత వారంతా మాయమయ్యారు. ఆమె మేనకోడలు దీప మాత్రమే కోర్టులో విజయం సాధించి వారసురాలిగా చలామణి అవుతున్నారు. తాజాగా, తమిళనాడులోని మధురైకి చెందిన మీనాక్షి (38) ఇప్పుడు తెరపైకి వచ్చారు.
జయ అసలైన వారసురాలిని తానేనని ఆమె చెప్పుకుంటున్నారు. తన తండ్రి శోభన్‌బాబు, తల్లి జయలలిత అని పేర్కొన్నారు. జయలలిత మృతి చెందడంతో తనకు వారసత్వ సర్టిఫికెట్ ఇవ్వాలంటూ జనవరి 27న ఆన్‌లైన్‌లో ఆమె దరఖాస్తు చేసుకున్నారు.
నెలదాటినా సర్టిఫికెట్ రాకపోవడంతో నేరుగా తాలూకా కార్యాలయానికి చేరుకుని సర్టిఫికెట్ ఎందుకు ఇవ్వడం లేదంటూ డిప్యూటీ తహసీల్దార్‌తో వాగ్వివాదానికి దిగారు. స్పందించిన ఆయన.. జయలలిత చెన్నైలో మృతి చెందారు కాబట్టి అక్కడికే వెళ్లి తీసుకోవాలని కోరారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన మీనాక్షి.. పళనిలో బంగారు రథం లాగే హక్కును తన తండ్రి శోభన్‌బాబు తనకు ఇచ్చారని, దానికి సంబంధించిన పత్రాలు తన వద్ద ఉన్నాయని, వారసత్వ సర్టిఫికెట్ ఎందుకు ఇవ్వరంటూ గొడవకు దిగారు. దీంతో కార్యాలయంలో కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది.
చివరికి కోర్టుకు వెళ్లి ఆ విషయం తేల్చుకోవాలంటూ అధికారులు ఆమెకు నచ్చజెప్పి అక్కడి నుంచి పంపించేశారు. అనంతరం మీనాక్షి మాట్లాడుతూ.. జయలలిత అసలు సిసలైన వారసురాలిని తానేనని, చిన్నప్పుడు ఆమె తనను వదిలించుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. బామ్మే తనను పెంచిందన్నారు. కోర్టుకు వెళ్లడంపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటానని మీనాక్షి తెలిపారు.