Congress: పంజాబ్ లో ఇప్పుడు ‘యాంటీ మాఫియా’ యుగం.. కాంగ్రెస్ ను దెప్పిపొడిచిన సిద్ధూ
- సీఎం భగవంత్ మాన్ కు ప్రశంసలు
- పంజాబ్ కు పునర్వైభవం తేవాలంటూ వినతి
- పరోక్షంగా సొంత పార్టీపై సిద్ధూ విమర్శలు
కాంగ్రెస్ పై నవజోత్ సింగ్ సిద్ధూ మరోసారి విమర్శలు గుప్పించారు. ఐదు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర ఓటమికి బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాల్సిందిగా ఆ ఐదు రాష్ట్రాల పార్టీ చీఫ్ లను అధినేత్రి సోనియా ఆదేశించిన నేపథ్యంలో.. మరునాడే సిద్ధూ పీసీసీ చీఫ్ పదవికి రాజీనామా సమర్పించిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే ఆయన పంజాబ్ సీఎం భగవంత్ మాన్ పై ప్రశంసలు కురిపిస్తూనే పరోక్షంగా కాంగ్రెస్ పై విమర్శలు చేశారు. ‘‘పెద్దగా అంచనాల్లేని, ఎవరి వద్దా ఏమీ ఆశించని వ్యక్తులే ఆనందపరులు. ఇప్పుడు కొండంత ఆశలు, అంచనాలతో పంజాబ్ లో మాఫియా వ్యతిరేక యుగాన్ని భగవంత్ మాన్ ప్రారంభించారు. కాబట్టి అందుకు అనుగుణంగా ఆయన పైకి ఎదుగుతారని ఆశిస్తున్నా. ప్రజాకర్షక పథకాలతో పంజాబ్ కు మళ్లీ పునర్వైభవం తెస్తారని అనుకుంటున్నా’’ అని పేర్కొంటూ సిద్ధూ ట్వీట్ చేశారు.