Etela Rajender: 2014లో టీడీపీని, 2018లో కాంగ్రెస్ ను మింగిన చరిత్ర కేసీఆర్ ది: ఈటల రాజేందర్
- కేసీఆర్ నైతికత లేని వ్యక్తి
- నైతికత ఉంటే హుజూరాబాద్ ఎన్నికల తర్వాత రాజీనామా చేసేవారు
- అసెంబ్లీలో నేను ఉండకూడదని ఆయన కోరుకుంటున్నారన్నా ఈటల
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నైతికత లేని వ్యక్తి అని బీజేపీ నేత ఈటల రాజేందర్ అన్నారు. బీజేపీ ఎమ్మెల్యేలను శాసనసభ నుంచి సస్పెండ్ చేయాలనేది కేసీఆర్ దుర్మార్గపు ఆలోచనే అని మండిపడ్డారు. 2014లో టీడీపీని, 2018లో కాంగ్రెస్ పార్టీని మింగిన చరిత్ర కేసీఆర్ దని అన్నారు. కేసీఆర్ ను ప్రజలు బండకేసి కొట్టే రోజులు దగ్గరపడ్డాయని చెప్పారు. తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. పీకేలు కేసీఆర్ ని కాపాడలేరని... తెలంగాణ ప్రజల చైతన్యమే బీజేపీని గెలిపిస్తుందని అన్నారు.
కేసీఆర్ అవమానిస్తోంది తెలంగాణ రాష్ట్ర గవర్నర్ ని కాదని, శాసనసభ మర్యాదనని ఈటల మండిపడ్డారు. హరీశ్ రావు ది కాకి లెక్కలు, దొంగ లెక్కల బడ్జెట్ అని అన్నారు. కార్మిక సంఘాలను రద్దు చేయించిన చరిత్ర కేసీఆర్ దని విమర్శించారు. ఆర్టీసీ, మున్సిపల్ కార్మికులను తొలగించాలని కేసీఆర్ అన్నప్పుడు తానే అడ్డుపడ్డానని తెలిపారు.
కేసీఆర్ అహంకారానికి, తెలంగాణ ఆత్మగౌరవానికి మధ్య జరిగిన ఎన్నికలు హుజూరాబాద్ ఎన్నికలని ఈటల పేర్కొన్నారు. కేసీఆర్ కు నైతికత ఉంటే హుజూరాబాద్ ఎన్నికల తర్వాత సీఎం పదవికి రాజీనామా చేసేవారని విమర్శించారు. తెలంగాణ ఉద్యమకారుడైన ఈటల సభలో ఉండకూడదని కేసీఆర్ కోరుకుంటున్నారని అన్నారు.