Brother Anil Kumar: ఏపీలో క్రైస్తవులంతా తన వెంటే నడుస్తారన్న భ్రమలో బ్రదర్ అనిల్ ఉన్నట్టున్నారు: ఏపీ క్రిస్టియన్ జేఏసీ విమర్శనాస్త్రాలు
- ఇటీవల ఏపీలో పర్యటించిన బ్రదర్ అనిల్
- అనిల్ వ్యాఖ్యలతో రాజకీయ కలకలం
- తీవ్రంగా స్పందించిన ఏపీ క్రిస్టియన్ జేఏసీ
- దేవుడి ముసుగులో రాజకీయాలా? అంటూ ఆగ్రహం
ప్రముఖ క్రైస్తవ మత ప్రబోధకుడు, సీఎం జగన్ బావ బ్రదర్ అనిల్ కుమార్ ఇటీవల తరచుగా ఏపీలో పర్యటిస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తుండడం తెలిసిందే. దీనిపై ఏపీ క్రిస్టియన్ జేఏసీ తీవ్రంగా స్పందించింది. ఏపీలో క్రైస్తవులు మొత్తం తన వెంటే నడుస్తారన్న భ్రమలో బ్రదర్ అనిల్ ఉన్నారని విమర్శించింది.
విజయవాడలో ఏపీ క్రిస్టియన్ జేఏసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మేదర సురేశ్ కుమార్ మాట్లాడుతూ, బ్రదర్ అనిల్ ఇప్పుడు దైవ సేవకుడా, లేక రాజకీయ నాయకుడా అనేది తేల్చి చెప్పాలని డిమాండ్ చేశారు. ఎవరైనా రాజకీయ పార్టీ ఏర్పాటు చేసుకోవచ్చని, ఆ హక్కును ఎవరూ కాదనలేరని, కానీ దేవుడి ముసుగులో రాజకీయాలు మాట్లాడడం సరికాదని హితవు పలికారు. ఒకవేళ రాజకీయాల్లోకి రావాలనుకుంటే బ్రదర్ అనిల్ కుమార్ దేవుని సేవ నుంచి వైదొలగాలని స్పష్టం చేశారు. దేవుడ్ని అడ్డంపెట్టుకుని రాజకీయాలు చేయడం సిగ్గుచేటు అని మేదర సురేశ్ కుమార్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఏపీని తన జాగీరుగా బ్రదర్ అనిల్ భావిస్తే అంతకంటే అవివేకం మరొకటి ఉండదన్నారు. గతంలో తాను రాజకీయాల్లోకి రానని అనిల్ కుమార్ అన్నారని, కానీ ఇటీవల విశాఖలో చేసిన వ్యాఖ్యలు విస్మయం కలిగించాయని అన్నారు.