Tamilnadu: తమిళనాట ఏపీ సీన్!.. బడ్జెట్ సమయంలో విపక్షం నిరసనలు!
- ఏపీ అసెంబ్లీలో బుగ్గన బడ్జెట్‌కు టీడీపీ నిరసనలు
- తాజాగా తమిళనాడు అసెంబ్లీలోనూ అదే సీన్
- విపక్ష నేతలపై తప్పుడు కేసులొద్దంటూ అన్నాడీఎంకే నినాదాలు
ఇటు అసెంబ్లీలో అయినా.. అటు పార్లమెంటులో అయినా ప్రభుత్వం వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో విపక్షాల నుంచి దాదాపుగా నిరసనలు వ్యక్తం కావు. అనాదిగా ఈ సంప్రదాయం కొనసాగుతూ వస్తోంది. అయితే మారిన రాజకీయ సమీకరణాలు, రాజకీయ పార్టీల మధ్య పెరుగుతున్న వైషమ్యాలు, అధికార పార్టీలు సాగిస్తున్న కక్షసాధింపు రాజకీయాల నేపథ్యంలో... ఈ సంప్రదాయం త్వరలోనే కనుమరుగు కానుందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఇటీవలే ఏపీ అసెంబ్లీలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డి వార్షిక బడ్జెట్ ప్రవేశపెడుతున్న సమయంలో విపక్ష టీడీపీ పెద్ద పెట్టున నినాదాలు చేసింది. తాజాగా అదే సీన్ శుక్రవారం నాడు తమిళనాడు అసెంబ్లీలోనూ కనిపించింది.
తమిళనాడు ఆర్థిక మంత్రి పళనివేల్ త్యాగరాజన్ సభలో వార్షిక బడ్జెట్ ప్రవేశపెడుతున్న సమయంలో విపక్ష అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు నిరసన వ్యక్తం చేశారు. విపక్ష నేతలపై తప్పుడు కేసులు పెట్టొద్దంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. దీంతో బడ్జెట్ ప్రసంగం సమయంలో నినాదాలు చేయడం సబబేనా? అంటూ స్పీకర్ ప్రశ్నించడంతో, అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు సభ నుంచి వాకౌట్ చేశారు. ఆ తర్వాత బడ్జెట్ ప్రసంగం సాఫీగానే సాగింది.