Fakir Ram Tamta: తండ్రి ఎమ్మెల్యే... టైర్లకు పంచర్లు వేసుకుంటూ ఒక కొడుకు, కార్పెంటర్ గా మరో కొడుకు!
- ఇటీవల ఉత్తరాఖండ్ అసెంబ్లీకి ఎన్నికలు
- బీజేపీ తరఫున గెలిచిన ఫకీర్ రామ్ టమ్టా
- సాధారణ జీవితం గడుపుతున్న కుమారులు
- తమ విధానంలో మార్పులేదని స్పష్టీకరణ
ఇటీవల ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికలు జరగడం తెలిసిందే. బీజేపీ తరఫున గంగోలీ హాట్ నియోజకవర్గం నుంచి బరిలో దిగిన ఫకీర్ రామ్ టమ్టా ఘనవిజయం సాధించారు. ఆయన ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. సాధారణంగా రాజకీయ నేతల పిల్లలు తమ పెద్దల బాటలోనే రాజకీయాల్లోకి రావడమో, లేక వారి అండదండలతో వ్యాపారాలు నిర్వహించడమో చేస్తారు. కానీ, ఫకీర్ రామ్ టమ్టా కుమారులు మాత్రం అందుకు భిన్నంగా, ఎంతో సాధారణ జీవితం గడుపుతున్నారు.
ఫకీర్ రామ్ పెద్ద కుమారుడు జగదీశ్ టమ్టా ఓ టైర్ పంచర్ షాపుతో జీవనోపాధి పొందుతుండగా, చిన్న కుమారుడు బీరేంద్ర రామ్ టమ్టా ఓ కార్పెంటర్.
ఫకీర్ రామ్ ఎమ్మెల్యేగా గెలిచిన నేపథ్యంలో ఆయన పెద్ద కుమారుడు జగదీశ్ ను మీడియా పలకరించింది. జగదీశ్ హల్ద్వాని ప్రాంతంలోని దమువాదువాన్ చౌపాల్ లో టైర్లకు పంచర్లు వేస్తుంటాడు. మీడియాతో మాట్లాడుతూ, తండ్రి ఎమ్మెల్యేగా గెలవడం తనను ఎంతో సంతోషానికి గురిచేసిందని చెప్పాడు. తన తండ్రి గతంలో కలప వ్యాపారం చేసేవాడని తెలిపాడు. తండ్రి ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ, తాము ఎప్పటినుంచో చేస్తున్న పనుల ద్వారానే ఉపాధి పొందుతున్నామని, ఇకపైనా అదే కొనసాగిస్తామని జగదీశ్ స్పష్టం చేశాడు.
చిన్న కుమారుడు బీరేంద్ర రామ్ ది కూడా ఇదే మాట. తమ తండ్రి ఎమ్మెల్యే అయినంత మాత్రాన తమ జీవనవిధానం మారబోదని అన్నాడు. గతంలో తమ తండ్రి అనేక అభివృద్ధి పనులు చేశాడని, ఇప్పుడు ఎమ్మెల్యేగా ఇంకా అభివృద్ధి చేస్తారని చెప్పాడు. అయితే తాము సాధారణ జీవితం గడిపేందుకే ఇష్టపడతామని బీరేంద్ర రామ్ పేర్కొన్నాడు.