Ukraine: చర్చల నిలిపివేతకు ఉక్రెయిన్ యత్నం.. పుతిన్ ఆరోపణ
- పుతిన్‌కు జర్మన్ ఛాన్సెలర్ ఫోన్
- ఉక్రెయిన్‌తో రష్యా చర్యల ప్రస్తావన
- ఉక్రెయిన్ అధికారులపై పుతిన్ ఆరోపణలు
రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య సాగుతున్న యుద్ధం విరమణకు రెండు దేశాలు చర్చల ప్రక్రియను కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మూడు విడతల చర్చలు విఫలం కాగా.. నాలుగు రోజుల క్రితం నాలుగో విడత చర్చలు మొదలయ్యాయి. ఈ చర్చల్లో ఎలాగైనా సానుకూల ఫలితం సాధించేలా రెండు దేశాలు యత్నిస్తున్నాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చర్చలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
చర్చలు నిలిచిపోయేలా ఉక్రెయిన్ అధికారులు యత్నిస్తున్నారని పుతిన్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ప్రస్తుత సంక్షోభానికి సరైన పరిష్కారాలను కనుగొనే దిశగా తాము యత్నిస్తూ ఉంటే.. శాంతి చర్చలు నిలిచిపోయే దిశగా ఉక్రెయిన్ అధికారులు అన్నిరకాల యత్నాలు చేస్తున్నారని పుతిన్ ఆరోపించారు. ఈ మేరకు తనకు ఫోన్ చేసిన జర్మన్ ఛాన్సెలర్ ఒలాఫ్ స్కోల్జ్‌తో మాట్లాడిన సందర్భంగా పుతిన్ ఈ వ్యాఖ్యలు చేశారు. చర్చలు విఫలమయ్యే దిశగా ఉక్రెయిన్ అధికారులు ఎంతగా యత్నించినా.. సంక్షోభ పరిష్కారం దిశగా తమ వంతు కృషి చేస్తామని పుతిన్ తెలిపారు.