TDP: ఆ అరెస్టుల తర్వాతే దాడులకు బ్రేకులెందుకు సార్?: వర్ల రామయ్య
- ఏపీలో ఏరులై పారుతున్న నాటు సారా
- గాల్లో కలుస్తున్న వ్యసనపరుల ప్రాణాలు
- నాటు సారా వల్ల చనిపోతే సహజ మరణాలెలా అయ్యాయన్న రామయ్య
పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో రోజుల వ్యవధిలోనే 20 మందికి పైగా మరణించిన విషయంపై ఏపీలో ఇంకా రాజకీయ వేడి తగ్గలేదు. అధికార వైసీపీ, విపక్ష టీడీపీ ఒకరిపై మరొకరు విమర్శలు సంధించుకుంటూనే ఉన్నాయి. తాజాగా ఈ విషయాన్ని ఆధారం చేసుకుని టీడీపీ కీలక నేత వర్ల రామయ్య జగన్ సర్కారుకు ఓ సూటి ప్రశ్న సంధించారు.
జంగారెడ్డిగూడెంలో ఎస్ఈబీ అధికారులు జరిపిన దాడుల్లో ఎందరో నాటుసారా కాపుదారులతో పాటు విక్రయదారులు కూడా అరెస్టయ్యారని గుర్తు చేసిన వర్ల.. ఈ అరెస్టుల తర్వాత ఏపీవ్యాప్తంగా ఎస్ఈబీ దాడులకు ఎందుకు బ్రేకులు పడ్డాయంటూ ప్రశ్నించారు. రాష్ట్రంలో నాటుసారా ఏరులై పారుతుంటే.. ఎందరో వ్యసనపరులు ప్రాణాలు పోతుంటే.. నాటుసారా మరణాలన్నీ సహజ మరణాలేనని స్వయంగా సీఎం జగన్ చెబుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు.