Electric Bus: ఏప్రిల్ 30 నుంచి ఏపీలో ఎలక్ట్రిక్ బస్సుల పరుగులు
- తిరుపతిలో తొలి బస్సును ప్రారంభించనున్న సీఎం
- తిరుపతి నుంచి 3 రూట్లలో 50 బస్సులు
- ఇంద్ర సర్వీసుల పేరుతో నడుపుతామన్న మంత్రి పేర్ని నాని
కొత్తగా అందుబాటులోకి రానున్న ఎలక్ట్రిక్ బస్సులు ఏపీ రోడ్లపై ఏప్రిల్ 30 నుంచి పరుగులు పెట్టనున్నాయి. ఈ మేరకు ఏపీ రవాణా శాఖ మంత్రి పేర్ని నాని శనివారం వెల్లడించారు. ఎలక్ట్రిక్ బస్సులకు సంబంధించిన టెండర్లను ఇప్పటికే పూర్తి చేశామని, కాంట్రాక్టు దక్కించుకున్న సంస్థ తన తొలి ఎలక్ట్రిక్ బస్సును ఏప్రిల్ 30న ఏపీ రోడ్లపైకి ప్రవేశపెట్టనుందని ఆయన వెల్లడించారు.
తిరుపతిలో తొలి ఎలక్ట్రిక్ బస్సును సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించనున్నారని పేర్ని నాని ప్రకటించారు. తిరుపతి నుంచి తిరుమల, మదనపల్లె, కర్నూలు తదితర మార్గాల్లో తొలి దశలో 50 బస్సులు నడపనున్నట్లు ఆయన తెలిపారు. ఏసీ సర్వీసులుగా తిరగనున్న ఈ బస్సులను ఇంద్ర సర్వీసుల పేరుతో నడుపుతామని ఆయన చెప్పారు.