Shimron Hetmyer: ఈ ఏడాది ఐపీఎల్ కప్పు‘ఆర్ఆర్’దే: హెట్ మేయర్
- అందుకు కావాల్సిన సామర్థ్యాలున్నాయి
- జట్టుతో కలసి ఆడాలనుకుంటున్నాను
- ధర ముఖ్యం కాదు
- ఎన్ని పరుగులు చేశానన్నదే కీలకం
- అభిప్రాయాలు పంచుకున్న వెస్టిండీస్ క్రికెటర్
వెస్టిండీస్ క్రికెటర్ సిమ్రాన్ హెట్ మేయర్ ఐపీఎల్ 2022 సీజన్ లో రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) జట్టు తరఫున ఆడనున్నాడు. అతడికి ఇది నాలుగో ఐపీఎల్ సీజన్ కానుంది.
2019 లో తొలిసారి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరఫున హెట్ మేయర్ ఆడాడు. అనంతరం యాజమాన్యం అతడ్ని విడుదల చేసింది. దాంతో ఢిల్లీ క్యాపిటల్స్ 2020లో హెట్ మేయర్ ను తీసుకుంది. 2021లోనూ అతడ్ని జట్టు రిటెయిన్ చేసుకుంది. కానీ, 2022 సీజన్ కు ముందు అతడ్ని ఢిల్లీ క్యాపిటల్స్ విడుదల చేసింది. మెగా వేలంలో రూ.8.5 కోట్లకు ఆర్ఆర్ అతడ్ని సొంతం చేసుకుంది.
మిడిలార్డర్ లో వచ్చి ఎక్కువ పరుగులు రాబట్టే నైపుణ్యం ఉన్న వాడిగా హెట్ మేయర్ కు మంచి గుర్తింపు ఉంది. రాయల్స్ జట్టుతో కలసి ఆడేందుకు తాను ఎంతో ఉత్సాహంగా ఉన్నట్లు తాజాగా హెట్ మేయర్ ప్రకటించాడు. ‘‘నా మంచి స్నేహితుడు ఎవిన్ లెవిస్ నుంచి ఆర్ఆర్ ఫ్రాంచైజీ విషయమై కొన్ని మంచి విషయాలు తెలుసుకున్నాను. అందుకే ఆర్ఆర్ తో చేరేందుకు ఎక్కువ రోజులు వేచి ఉండాలనుకోవడం లేదు. జట్టుతో చేరి ఆనందించాలని అనుకుంటున్నాను. జట్టు విషయంలో ఎంతో ఉత్సాహంతో ఉన్నాం. ఐపీఎల్ కప్పును సొంతం చేసుకునేందుకు మంచి సామర్థ్యాలు ఉన్నాయని నమ్ముతున్నాను’’అని చెప్పాడు.
తనకు ధర ఎంతన్నది ముఖ్యం కాదన్నాడు హెట్ మేయర్. జట్టు కోసం తానెన్ని పరుగులు సాధిస్తానన్నదే ముఖ్యమన్నాడు. జట్టు కోరుకున్న ఏ పాత్రనైనా పోషించేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించాడు.