India: కరోనా వచ్చిన తర్వాత అత్యంత కనిష్టానికి తగ్గిన కేసులు
- గడిచిన 24 గంటల్లో 1,761 కొత్త కేసులు
- 2020 ఏప్రిల్ తర్వాత అత్యంత కనిష్ట స్థాయి ఇది
- కరోనాతో 127 మంది మరణం
ఒకవైపు ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు 8 శాతం పెరిగాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తుండగా.. మరోవైపు భారత్ లో కొత్త కేసులు భారీగా తగ్గిపోయాయి. గడిచిన 24 గంటల్లో 4,31,973 మందికి పరీక్షలు నిర్వహించగా 1,761 కొత్త కేసులు వెలుగు చూశాయి. 2020 ఏప్రిల్ నుంచి చూస్తే రోజువారీ కేసుల్లో ఇదే కనిష్ట స్థాయి. యాక్టివ్ కేసులు 26,240గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో 127 మంది కరోనాతో మరణించారు.
భారత్ లో ఇప్పటి వరకు కరోనా వల్ల 5,16,479 మంది మరణించారు. మరణాల రేటు 1.20 శాతంగా ఉంది. దేశవ్యాప్తంగా కోలుకుంటున్న వారు 98.74 శాతంగా ఉన్నారు. కరోనా నుంచి క్షేమంగా బయటపడిన వారు 4.24 కోట్లుగా ఉన్నారు. శనివారం ఒక్కరోజే 15,34,444 మందికి టీకాలు వేశారు. ఇప్పటి వరకు 181.21 కోట్ల వ్యాక్సిన్ డోసేజీలు ఇచ్చారు.