Kashmir Files: కశ్మీర్ ఫైల్స్ విడుదలపై న్యూజిలాండ్ లో వివాదం.. మాజీ ఉప ప్రధాని మద్దతు
- అనుమతించకపోతే స్వేచ్ఛపై దాడి చేసినట్టే
- మాజీ ఉప ప్రధాని విన్ స్టన్ పీటర్స్
- ఇంకా నిర్ణయం తీసుకోని సెన్సార్ బోర్డు
- ముస్లిం కమ్యూనిటీ నుంచి ఆందోళన
కశ్మీర్ ఫైల్స్ కు ఇంటా బయటా మంచి ఆదరణ లభిస్తోంది. కానీ, న్యూజిలాండ్ లో ఈ సినిమా ప్రదర్శనకు ఆటంకాలు ఏర్పడగా.. ఆ దేశ మాజీ ఉప ప్రధాని విన్ స్టన్ పీటర్స్ మద్దతుగా నిలిచారు. అమెరికా, ఆస్ట్రేలియా, ఎన్నో ఇతర దేశాల్లో విడుదలైన కశ్మీర్ ఫైల్స్ సినిమాను న్యూజిలాండ్ లో ప్రదర్శిచేందుకు అనుమతించకపోతే.. అది న్యూజిలాండ్ వాసుల స్వేచ్ఛపై దాడి చేసినట్టేనని వ్యాఖ్యానించారు.
ఈ సినిమా (కశ్మీర్ ఫైల్స్)ను సెన్సార్ చేయడం అంటే.. న్యూజిలాండ్ లో మార్చి 15న జరిగిన దారుణాల సమాచారాన్ని లేదా దృశ్యాలను సెన్సార్ చేయడమే. లేదంటే 9/11 దాడులకు సంబంధించి ప్రజల మనసుల్లో ఉన్న అన్ని దృశ్యాలను చెరిపివేయడమే అవుతుంది. ప్రధాన స్రవంతిలోని ముస్లింలు దేశీయంగా, అంతర్జాతీయంగా ఇస్లామ్ పేరుతో జరుగుతున్న హింసను ఖండించారు’’అని విన్ స్టన్ పీటర్స్ తన ఫేస్ బుక్ పేజీలో పోస్ట్ పెట్టారు.
కశ్మీర్ ఫైల్స్ సినిమాలో కొన్ని మత మూకలను తప్పుగా చూపించడాన్ని న్యూజిలాండ్ సెన్సార్ బోర్డు కత్తెర వేయాలని అనుకుంటున్నట్టు సినిమా డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి ఇప్పటికే ప్రకటించారు. చరిత్ర నేపథ్యం తెలియకపోతే ఇలాంటి సమస్యే ఏర్పడుతుంది. కశ్మీర్ ఫైల్స్ లో చూపించిన కథనం.. కశ్మీర్ లో పండిట్ల ఊచకోతలు. కానీ, ప్రధాన కథనానికే కత్తిరింపులు చేస్తే సినిమా ప్రయోజనం ఏముంటుందన్నదే ప్రశ్న.
ఈ సినిమాపై న్యూజిలాండ్ సెన్సార్ బోర్డ్ ఇంకా నిర్ణయం ప్రకటించాల్సి ఉంది. ముస్లిం కమ్యూనిటీకి చెందిన కొందరు సభ్యులు తనను కలసి ఆందోళన వ్యక్తం చేసినట్టు చీఫ్ సెన్సార్ డేవిడ్ షాంక్స్ తెలిపారు. ఈ సినిమాలో ముస్లిం వ్యతిరేక సెంటిమెంట్స్ చూపించినట్టు పేర్కొన్నారు.