Siddaramaiah: భగవద్గీతతో పాటు ఖురాన్, బైబిల్ను విద్యార్థులకు నేర్పినా అభ్యంతరం లేదు: సిద్ధ రామయ్య
- ఏ మత గ్రంథాలకు కూడా వ్యక్తిగతంగా వ్యతిరేకం కాను
- మన దేశానిది భిన్నమైన సంస్కృతి
- మనం సమైక్య జీవన విధానంలో ఉన్నాం
- బడుల్లో పాఠ్యాంశాలలో భగవద్గీత ద్వారా నైతిక విద్య నేర్పించవచ్చు
- మాకు ఎటువంటి అభ్యంతరం లేదు
గుజరాత్లోని పాఠశాలల్లో భగవద్గీత ప్రవేశపెడుతున్న అంశంపై కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య స్పందించారు. తాను ఏ మత గ్రంథాలకు కూడా వ్యక్తిగతంగా వ్యతిరేకం కానని చెప్పారు. మన దేశానిది భిన్నమైన సంస్కృతి అని ఆయన అన్నారు. మనం సమైక్య జీవన విధానంలో ఉన్నామని చెప్పారు. తాము హిందూ ధర్మంపై నమ్మకం కల్గినవారమని తెలిపారు. బడుల్లో పాఠ్యాంశాలలో భగవద్గీత ద్వారా నైతిక విద్య నేర్పించడంలో తమకు ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పారు.
తాము రాజ్యాంగపరంగా లౌకికవాద విధానాలను నమ్ముతామని తెలిపారు. బడుల్లో భగవద్గీతతో పాటు ఖురాన్, బైబిల్ను విద్యార్థులకు నేర్పినా తమకు అభ్యంతరం లేదని చెప్పారు. విద్యార్థులకు అవసరమైనది గుణాత్మకమైన విద్య అని తెలిపారు. భగవద్గీతను మన ఇళ్లలో పిల్లలకు చెబుతారని ఆయన అన్నారు. రామాయణ, మహాభారతం వంటివాటిని కూడా పిల్లలకు నేర్పుతారని గుర్తు చేశారు. నైతిక విద్య అవసరమని, కానీ అది రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాత్రం ఉండకూడదని అన్నారు.