Neem: పళ్లు తోముకుంటూ వేప పుల్ల మింగేశాడు... చిన్న గాటు కూడా పెట్టకుండా పుల్లను బయటికి తీసిన వైద్యులు
- ఖమ్మం జిల్లాలో ఘటన
- వేప పుల్ల మింగేసిన కల్లు గీత కార్మికుడు
- ఆసుపత్రికి తరలించిన కుటుంబ సభ్యులు
- ఎండోస్కోపీ మిషన్ తో పుల్లను వెలికితీసిన డాక్టర్లు
ఖమ్మం జిల్లాలో ఆసక్తికర ఘటన జరిగింది. ఓ వ్యక్తి ఉదయం పళ్లు తోముకుంటూ వేప పుల్లను అనుకోని రీతిలో మింగేశాడు. అయితే వైద్యులు చిన్న గాటు కూడా పెట్టకుండా పుల్లను బయటికి తీశారు. ముదిగొండ మండలం కమలాపురం గ్రామానికి చెందిన పర్సగాని ఆదినారాయణ కల్లుగీత కార్మికుడు. ఎప్పట్లాగానే ఉదయం పూట వేప పుల్లతో పళ్లు తోముకుంటున్నాడు. అయితే, అనూహ్యంగా ఆ వేప పుల్ల అతడి నోట్లోంచి కడుపులోకి వెళ్లిపోయింది.
కుటుంబ సభ్యులు అతడిని ఖమ్మం పట్టణానికి తీసుకువచ్చి అపెక్స్ మల్టీస్పెషాలిటీ ఆసుపత్రిలో చేర్చారు. అతడికి వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు ఎండోస్కోపీ మిషన్ ద్వారా కడుపులోని వేప పుల్లను చాకచక్యంగా బయటికి తీశారు. గ్యాస్ట్రో ఎంటరాజలిస్ట్ డాక్టర్ అరుణ్ సింగ్ నేతృత్వంలోని డాక్టర్ల బృందం ఈ ప్రక్రియను విజయవంతం చేసింది. అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.