Gulam Nabi Azad: ప్రజల్లో విభజనకు కాంగ్రెస్ పార్టీ కూడా ప్రయత్నిస్తుంటుంది... సొంత పార్టీపైనా నింద మోపిన గులాం నబీ ఆజాద్

Gulam Nabi Azad comments on his own party

  • 'కశ్మీర్ ఫైల్స్' నేపథ్యంలో ఆజాద్ వ్యాఖ్యలు
  • పార్టీలు ప్రజల్లో చీలిక తెచ్చే ప్రయత్నం చేస్తాయని వెల్లడి
  • ఏ పార్టీని క్షమించబోనని స్పష్టీకరణ
  • కశ్మీర్ దుస్థితికి పాకిస్థాన్, ఉగ్రవాదమే కారణమని ఆరోపణ

కాంగ్రెస్ అసమ్మతి వర్గం నేత గులాం నబీ ఆజాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల విడుదలైన 'ది కశ్మీర్ ఫైల్స్' చిత్రం నేపథ్యంలో దేశవ్యాప్తంగా కశ్మీర్ పరిస్థితులపై చర్చ జరుగుతోంది. నాటి అల్లర్లలో జీవితాలు నష్టపోయిన కశ్మీరీ పండిట్లకు న్యాయం చేయాలన్న డిమాండ్లు బలంగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, గులాం నబీ ఆజాద్ స్పందిస్తూ, ప్రజల్లో విభజన సృష్టించేందుకు రాజకీయ పార్టీలు ప్రయత్నించడం సాధారణమని, కాంగ్రెస్ పార్టీ కూడా అందుకు మినహాయింపు కాదన్నారు. 

మతం, కులం తదితర అంశాలను ఉపయోగించుకుని ప్రజల్లో చీలిక తెచ్చేందుకు పార్టీలు ప్రయత్నిస్తుంటాయని, ఈ విషయంలో తాను కాంగ్రెస్ పార్టీని కూడా వెనుకేసురావడంలేదని తెలిపారు.  ఈ అంశంలో తాను ఏ ఒక్క పార్టీని క్షమించబోనని స్పష్టం చేశారు. కశ్మీర్ లో జరిగిన దారుణాల్లో హిందువులు, పండిట్లు, డోగ్రాలు, ముస్లింలు తీవ్రంగా ప్రభావితులయ్యారని ఆజాద్ వివరించారు. కుల, మతాలకు అతీతంగా అందరికీ న్యాయం జరగాల్సి ఉందన్నారు. కశ్మీర్ దుస్థితికి పాకిస్థాన్, ఉగ్రవాదం ప్రధాన కారణాలు అని అన్నారు.

  • Loading...

More Telugu News