Mumbai Indians: తమ ఆటగాళ్ల కోసం 13 వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఎంఐ ఎరీనా ఏర్పాటు చేసిన ముంబయి ఇండియన్స్
- ఈ నెల 26 నుంచి ఐపీఎల్
- కఠినమైన బయోబబుల్ లో ఆటగాళ్లు
- ఆటగాళ్ల ఉల్లాసం కోసం ముంబయి ఇండియన్స్ ప్రత్యేక వినోదం
మరికొన్నిరోజుల్లో ఐపీఎల్ 15వ సీజన్ ప్రారంభం కాబోతోంది. కరోనా వ్యాప్తి ఇంకా ఉన్నందున ఆటగాళ్లు మరోసారి కఠినమైన బయోబబుల్ లో కొనసాగుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆటగాళ్లు సేదదీరేందుకు ముంబయి ఇండియన్స్ యాజమాన్యం జియో వరల్డ్ గార్డెన్స్ లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఆటగాళ్లు, వారి కుటుంబ సభ్యులు, కోచింగ్ సిబ్బంది వినోదం కోసం 13 వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో ప్రత్యేకంగా ఎంఐ ఎరీనాకు రూపకల్పన చేసింది.
బిజీ షెడ్యూల్ నడుమ జట్టులో మరింత అనుబంధం పెంచేందుకు ఈ వినోద ప్రాంగణం ఉపయోగడపడుతుందని ముంబయి ఇండియన్స్ భావిస్తోంది. ముఖ్యంగా ఆటగాళ్లు ఉత్సాహంగా ఉండేందుకు, దైనందిన జీవితంలో సమతుల్యతతో ఉండేందుకు ఇది ఎంతగానో ఉపకరిస్తుందని ఆశిస్తోంది. ఎంఐ ఎరీనాలో జట్టు పరంగానూ, వ్యక్తిగతంగానూ వినోదం పొందేందుకు తగిన విభాగాలు ఉన్నాయి. ఫుట్సాల్ గ్రౌండ్, పికిల్ బాల్ కోర్టు, బాక్స్ క్రికెట్, ఫుట్ వాలీబాల్, గోల్ఫ్ డ్రైవింగ్ రేంజ్, ఎంఐ బ్యాటిల్ గ్రౌండ్, మిని గోల్ఫ్, ఎంఐ కేఫ్, కిడ్స్ జోన్ ఏర్పాటు చేశారు.
ఈ ఎంఐ ఎరీనా ఆటగాళ్ల ప్రధాన బయో బబుల్ లో ఓ భాగంగా ఉంటుంది. తద్వారా, కరోనా బారినపడతామేమోన్న భయం ఉండదు. జట్టులోని ప్రతి ఒక్కరినీ సంతోషంగా ఉంచడం తమకు ఎంతో ముఖ్యమని ముంబయి ఇండియన్స్ అధికార ప్రతినిధి వెల్లడించారు. ఐపీఎల్ ఈ నెల 26న ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. తాజా సీజన్ లో ముంబయి ఇండియన్స్ తన తొలి మ్యాచ్ ను ఈ నెల 27న ఢిల్లీ క్యాపిటల్స్ తో ఆడనుంది. ఈ మ్యాచ్ కు ముంబయిలోని బ్రాబౌర్న్ స్టేడియం ఆతిథ్యమివ్వనుంది.