Imran Khan: భారత్‌పై ప్రశంసల వర్షం కురిపించిన ఇమ్రాన్ ఖాన్

Pakistan PM Imran Khan praises Indias independent foreign policy

  • భారత్ విదేశీ విధానం భేష్
  • అమెరికా వద్దంటున్నా రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేస్తోంది
  • దాని స్వత్రంత విదేశీ విధానాన్ని అభినందిస్తున్నా
  • నేనెవరికీ తలవంచనన్న ఇమ్రాన్ ఖాన్ 

వీలు చిక్కినప్పుడల్లా భారత్‌పై విరుచుకుపడే పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఈసారి ప్రశంసల జల్లు కురిపించారు. భారత విదేశాంగ విధానం భేష్ అని కొనియాడారు. ఖైబర్-ఫఖ్తూన్‌ఖ్వా ప్రావిన్సులో జరిగిన బహిరంగ ర్యాలీలో ఇమ్రాన్ మాట్లాడుతూ.. అమెరికా ఆంక్షలు ఉన్నప్పటికీ రష్యా నుంచి భారత్ ముడిచమురు దిగుమతి చేసుకుని స్వతంత్ర విదేశీ విధానాన్ని అనుసరించిందని అన్నారు. ఇందుకు తాను భారత్‌ను అభినందిస్తున్నానని అన్నారు.

క్వాడ్ కూటమిలో భాగమైన భారత్.. అమెరికా వద్దంటున్నా సరే రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తోందన్నారు. తమ ప్రభుత్వం కూడా పాక్ ప్రయోజనాలకే పాటుపడుతుందని, తానెవరికీ తలవంచనని, దేశాన్ని కూడా తలవంచనివ్వనని తేల్చి చెప్పారు. ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాకు వ్యతిరేకంగా పాకిస్థాన్ మద్దతు కావాలన్న యూరోపియన్ యూనియన్ ప్రతినిధుల మాటలకు తాను అంగీకరించలేదని ఇమ్రాన్ ఈ సందర్భంగా తెలిపారు. ఈయూ మాటల వల్ల పాక్‌కు ఒరిగే ప్రయోజనం ఏమీ లేదనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు.

ఆఫ్ఘనిస్థాన్‌లో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా అమెరికా జరిపిన పోరాటంలోనూ తాము భాగస్వాములమయ్యామన్నారు. ఈ క్రమంలో 80 వేల మంది ప్రజలను, రూ.7.60 లక్షల కోట్లు నష్టపోయామని ఇమ్రాన్ ఆవేదన వ్యక్తం చేశారు. పార్లమెంటులో ప్రతిపక్షాలు తనపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం, సొంతపార్టీలోని కొందరు ప్రతిపక్షాలకు మద్దతు పలకడంతో ఇరకాటంలో పడిన ఇమ్రాన్ అవిశ్వాస తీర్మానంలో ఓడిపోయి గద్దె దిగడం ఖాయంగా కనిపిస్తోంది. మరోవైపు, పాక్ ఆర్మీ కూడా ఇమ్రాన్‌ను తప్పుకోవాలని  ఒత్తిడి తీసుకొస్తోంది. ఈ నేపథ్యంలో ప్రజా మద్దతు కూడగట్టుకునేందుకు ఇమ్రాన్ ఇలా ర్యాలీలు నిర్వహిస్తున్నారు.

  • Loading...

More Telugu News