East Godavari District: ఇంటిపన్ను కట్టలేదని.. మనుషులున్నా బయట తాళం వేసిన పిఠాపురం మునిసిపల్ అధికారులు!
- ఇంట్లో మహిళలు ఉండగానే సీలు
- గొడవకు దిగడంతో ఓ ఇంటి తాళం తొలగింపు
- వడ్డీ వ్యాపారుల కంటే దారుణంగా వ్యవహరిస్తున్నారని టీడీపీ మండిపాటు
ఇంటిపన్ను కట్టలేదన్న కారణంతో తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం మునిసిపల్ అధికారులు ఇంట్లో మనుషులు ఉండగానే తాళాలు వేస్తున్నారు. దీనిపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పట్టణంలోని మోహన్‌నగర్‌లో పన్ను వసూళ్లకు వెళ్లిన అధికారులు గొర్రెల సత్తిబాబు, రమణ ఇళ్లకు వెళ్లారు. పన్ను చెల్లించని కారణంగా వారిళ్లకు తాళాలు వేసి సీలు వేసి నోటీసులు అంటించారు. ఇంట్లో మహిళలు ఉండగానే గేటుకు తాళాలు వేశారు. సత్తిబాబు ఇంట్లోని మహిళలు ఆందోళనకు దిగడంతో తాళాలు తొలగించారు. సత్తిబాబు ఇంటికి వేసిన సీలును మాత్రమే అలానే ఉంచి వెళ్లిపోయారు.
ఈ సందర్భంగా సత్తిబాబు మాట్లాడుతూ.. తనకు ఎప్పుడూ రూ. 1,600 మాత్రమే వచ్చేదని, ఈసారి మాత్రం ఏకంగా రూ.6,400 పన్ను వచ్చిందని సత్తిబాబు ఆవేదన వ్యక్తం చేశారు. పన్ను చెల్లించేందుకు తనకు గడువు ఇవ్వాలని కోరినా పట్టించుకోలేదన్నారు. విషయం తెలిసిన పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ అధికార ప్రతినిధి ఎస్వీఎస్ఎన్ వర్మ..సత్తిబాబు, రమణ ఇళ్లను పరిశీలించారు. వారిళ్లపై టీడీపీ జెండాలు ఉండడంతో అధికారులు కక్షసాధింపు చర్యలకు దిగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మునిసిపల్ అధికారులు, సిబ్బంది తీరు వడ్డీ వ్యాపారులకంటే దారుణంగా ఉందని మండిపడ్డారు.