- నాణ్యమైన 4జీ సేవలను ఆఫర్ చేస్తాం
- కస్టమర్లు మా నుంచి వెళ్లిపోరనే మా నమ్మకం
- 5జీ విస్తరణకు సమయం పడుతుంది
- బీఎస్ఎన్ఎల్ చైర్మన్, ఎండీ పుర్వార్
పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయి.. ఒడ్డును పడే ప్రయత్నాలు చేస్తున్న ప్రభుత్వరంగ టెలికం కంపెనీ బీఎస్ఎన్ఎల్.. 4జీ టెక్నాలజీతో దిగ్గజాలకు పోటీ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. సంస్థ చైర్మన్, ఎండీ పీకే పుర్వార్ దీనిపై మాట్లాడుతూ.. 2021-22 సంవత్సరంలో రూ.17,000 కోట్ల ఆదాయం లభిస్తుందన్న అంచనాతో ఉన్నట్టు చెప్పారు. వాస్తవానికి అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఆదాయం రూ.17,452 పోలిస్తే తక్కువే. కాల్ కనెక్ట్ చార్జీలను తొలగించడం ఇందుకు కారణంగా పుర్వార్ తెలిపారు.
ఒకవైపు ప్రైవేటు టెల్కోలు 5జీ సేవలతో ముందుకు వచ్చే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు నాణ్యమైన 4జీ సేవల ద్వారా వాటితో పోటీ పడతామని పుర్వార్ చెప్పడం గమనార్హం. నాణ్యమైన 4జీ సేవలతో కస్టమర్ల ఆదరణను చూరగొంటామని, వారు తమను వీడిపోకుండా కాపాడుకుంటామన్న ఆశాభావం పుర్వార్ మాటల్లో వ్యక్తమైంది.
5జీ సేవలను ప్రైవేటు ఆపరేటర్లు ప్రారంభించడం వల్ల తక్షణమే బీఎస్ఎన్ఎల్ కు అది ప్రతికూలంగా మారదన్నారు. 5జీని సపోర్ట్ చేసే పరికరాల వినియోగం విస్తృతం కావడానికి చాలా సమయం తీసుకుంటుందన్నారు. బీఎస్ఎన్ఎల్ 4జీ సేవల ఆవిష్కరణ ప్రణాళిక మేరకే కొనసాగుతోందని చెప్పారు. 2022లో 4జీ సేవలను అందించాలన్నది బీఎస్ఎన్ఎల్ లక్ష్యం.
బీఎస్ఎన్ఎల్ 2019-20లో రూ.15,500 కోట్ల నష్టాలను ప్రకటించగా.. 2020-21లో నష్టాలను రూ.7,441 కోట్లకు తగ్గించుకుంది. అయితే ఈ నెలతో ముగిసే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ (2021-22) నష్టాలు గతేడాది స్థాయిలోనే ఉంటాయని పుర్వార్ స్పష్టం చేశారు.