CM KCR: సమస్యలను పక్కదారి పట్టించడానికే ఈ సినిమాను విడుదల చేశారు: సీఎం కేసీఆర్
- కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ఎల్పీ భేటీ
- ది కశ్మీర్ ఫైల్స్ చిత్రాన్ని ప్రస్తావించిన కేసీఆర్
- ఆనాడు బీజేపీనే అధికారంలో ఉందని వెల్లడి
- ఇప్పుడు కావాల్సింది డెవలప్ మెంట్ ఫైల్స్ అని స్పష్టీకరణ
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ది కశ్మీర్ ఫైల్స్ చిత్రంపై తెలంగాణ సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశంలో స్పందించారు. దేశంలో సమస్యలను పక్కదారి పట్టించడానికే ఈ చిత్రాన్ని విడుదల చేశారని ఆరోపించారు. రైతు సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకు ఈ సినిమాను తెరపైకి తెచ్చారని మండిపడ్డారు. నాడు కశ్మీర్ లో పండిట్లను ఊచకోత కోసినప్పుడు బీజేపీ ప్రభుత్వమే కదా అధికారంలో ఉంది? అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు దేశానికి కావల్సింది కశ్మీర్ ఫైల్స్ కాదని, డెవలప్ మెంట్ ఫైల్స్ అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.
వివేక్ ఆర్ అగ్నిహోత్రి దర్శకత్వంలో అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, పల్లవి జోషి తదితరులు నటించిన ఈ చిత్రం మార్చి 11న ప్రేక్షకుల ముందుకొచ్చింది. విశేషంగా ప్రజాదరణ పొందడమే కాదు, బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ పది రోజుల్లో రూ.192.35 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమా బడ్జెట్ కేవలం రూ.12 కోట్లు మాత్రమే!