AB Venkateswara Rao: 2019 మే వరకు ఏ ప్రభుత్వం పెగాసస్ వాడలేదు: ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు

AB Venkateswararao press meet on Pegasus row

  • ఏపీలో పెగాసస్ రగడ
  • హౌస్ కమిటీ ఏర్పాటు చేసిన ఏపీ అసెంబ్లీ
  • మీడియా ముందుకు వచ్చిన ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్
  • సమాచారం వెల్లడించడం తన బాధ్యత అని ఉద్ఘాటన

పెగాసస్ స్పై వేర్ అంశంలో ఏపీ అసెంబ్లీ అట్టుడుకుతోంది. విపక్ష టీడీపీ అధికార వైసీపీ నేతలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. పెగాసస్ అంశంపై హౌస్ కమిటీ ఏర్పాటు చేస్తూ ఏపీ అసెంబ్లీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో, పెగాసస్ అంశంలో సందేహాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత తనపై ఉందంటూ ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు తెరపైకి వచ్చారు. ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్భంగా మాట్లాడుతూ,  పెగాసస్ అంశం వల్ల ప్రజల్లో అభద్రతాభావం కలుగుతోందని అన్నారు.  2019 మే ముందు వరకు ఏ ప్రభుత్వం కూడా పెగాసస్ ను వాడలేదని స్పష్టం చేశారు. ప్రభుత్వం కానీ, డీజీపీ కార్యాలయం కానీ, ఇంటెలిజెన్స్ విభాగం కానీ, మరే ఇతర ప్రభుత్వ విభాగం కానీ, ఏ ప్రైవేటు కార్యాలయం కానీ పెగాసస్ ను కొనడం కానీ, వాడడం కానీ చేయలేదని స్పష్టం చేశారు. ఫోన్లు హ్యాకింగ్, ట్యాపింగ్ కాలేదని తెలిపారు. 

అప్పటి ఏపీ ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్నందున తనకు పూర్తి సమాచారం ఉందని పేర్కొన్నారు. అప్పటి డీజీపీ కార్యాలయం కాకుండా, మరొకరు కొని ఉండొచ్చని కొందరు ఆరోపిస్తున్నారని తెలిపారు. 2019 మే తర్వాత ఏం జరిగిందో తనకు తెలియదని వెల్లడించారు. 2021 ఆగస్టు వరకు పెగాసస్ ను తాము కొనుగోలు చేయలేదని డీజీపీ ఆఫీసు కూడా వెల్లడించింది కాబట్టి, భయాందోళనలు వీడాలని అన్నారు.

అయితే, అసలు ఎప్పుడూ కొనని సాఫ్ట్ వేర్ గురించి నేను సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తుండడం హాస్యాస్పదంగా ఉందని వెంకటేశ్వరరావు వ్యాఖ్యానించారు. పెగాసస్ అంశంలో సందేహాలు లేవనెత్తి ప్రజలను భయాందోళనలకు గురిచేయొద్దని హితవు పలికారు. దీనిపై సందేహాలను నివృత్తి చేయాల్సింది ప్రభుత్వమేనని ఉద్ఘాటించారు. అయితే ఓ సీనియర్ ఐపీఎస్ అధికారిగా ప్రజల్లో ఉన్న ఆందోళనలు, భయాలు, సందేహాలను తొలగించాల్సిన బాధ్యత తనపై ఉందని భావిస్తున్నానని, అందుకే మీడియా ముందుకు వచ్చానని వెంకటేశ్వరరావు వెల్లడించారు. 

2015 నుంచి 2019 మార్చి ఆఖరు వరకు తాను ఏపీ ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేశానని తెలిపారు. ఆ తర్వాత మరో రెండు నెలల పాటు నిఘా విభాగంలో ఏంజరుగుతోందన్న దానిపై తనకు సమాచారం ఉందని పేర్కొన్నారు. పెగాసస్ పై ఎవరూ భయాందోళనలకు గురికావాల్సిన పనిలేదని అన్నారు.

  • Loading...

More Telugu News